18-12-2025 12:00:00 AM
గ్రామీణ ప్రాంతాల్లో కష్టం చేసేవారికి ఏడాదికి కనీసం 100 రోజుల పని దినాలు కల్పించేందుకు 20 ఏళ్ల క్రితం తీసుకొచ్చిన ‘మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’ (ఎంజీనరేగా) పేరు మార్పు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ పథకానికి కేంద్రం.. ‘వికసిత్ భారత్ గ్యారంటీ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్)’ (వీబీ-జీ-రామ్-జీ) అని మార్చడంపై భగ్గుమన్న ప్రతిపక్షాలు పార్లమెంట్‌లో నిరసనలు చేపట్టాయి.
కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలను, వాటి పేర్లను ఎన్డీయే ప్రభుత్వం తొలగించాలనుకోవడం వెనుక ఉద్దేశ్యం ఏంటనేది స్పష్టం చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. అయితే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చూసుకుంటే.. ‘నిర్మల్ భారత్ అభియాన్’ పేరును ‘స్వచ్ఛ భారత్ అభియాన్’గా, గ్రామీణ ప్రాంతాలకు ఎల్పీజీ సరఫరా పథకాన్ని ‘ఉజ్వల్’గా మార్పులు చేసింది. ప్రణాళిక సంఘం స్థానంలో నీతి ఆయోగ్‌ను ప్రవేశపెట్టడం జరిగింది.
తాజాగా ఉపాధి హామీ పథకం పేరును ‘వికసిత్ భారత్ గ్యారంటీ రోజ్ గార్ అజీవికా మిషన్’ అని నోరు తిరగని పదంతో పలకడం కాస్త కష్టమే. అయితే 2047 నాటికి ‘వికసిత్ భారత్’ లక్ష్యమని ప్రధాని మోదీ పదే పదే చెప్పిన నేపథ్యంలో పథకానికి ముందు ‘వికసిత్ భారత్’ అని పేరు చేర్చి ఉంటారు. అయితే గాంధీ పేరు ఎందుకు తొలగించారనే దానిపై కేంద్రం సమాధానం ఇవ్వలేదు. తొలుత ఉపాధి హామీ పథకాన్ని గుంతలు తవ్వే పథకమంటూ ఎన్డీయే ప్రభుత్వం అవహేళన చేసింది.
తాజాగా కొత్త పథకం కింద ఉపాధి హామీ కల్పించడంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించడం లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటికే ఈ పథకం కింద చేస్తున్న పనులు మినహాయిస్తే కొత్తగా ఏం చేస్తామన్నది వివరించడంలో కేంద్రం విఫలమైంది. ఉపాధి హామీ అనేది కష్టకాలంలో తీసుకొచ్చిన పథకం. వరుస కరువులు, ఆర్థిక సంస్కరణలతో కుదేలై గ్రామీణ భారతం సంక్షోభంలో చిక్కుకోవడంతో రైతుల ఆత్యహత్యలు, ఉపాధి కరువై వలసలు పెరిగిపోయాయి.
ఈ నేపథ్యంలో 2005లో అప్పటి యూపీఏ ప్రభుత్వం ‘జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’ తీసుకొచ్చింది. అయితే యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకంలోనూ లోపాలు ఉండేవి. ఈ పథకం వల్ల తమకు కూలీల లభ్యత తగ్గిందని రైతుల ఫిర్యాదులు, వేతనాల చెల్లింపులో ఆలస్యం, నిధుల అరకొర కేటాయింపు, అవినీతి పెరిగిపోవడం లాంటి విమర్శలు వచ్చాయి.
తాజాగా ఎన్డీయే తీసుకొచ్చిన ‘వీబీ జీ-రామ్-జీ’ పథకం కింద ఉపాధి హామీ 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచడం వరకు బాగానే ఉన్నప్పటికీ ఇక్కడే చిన్న మెలిక పెట్టింది. ఈశాన్య రాష్ట్రాలూ, కశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ మినహా మిగతా రాష్ట్రాలు పథకంలో 40 శాతం భరించడం ఇప్పుడు ప్రధాన సమస్య. గతంలో ఇది 10 శాతం మాత్రమే. ఇకపై రాష్ట్రాలు ఏటా కనీసం రూ.50వేల కోట్లు వెచ్చించాలి.
పైగా ప్రతి ఏటా నిర్దిష్ట మొత్తంలో నిధులు కేటాయించటం, అంతకుమించి పెరిగితే రాష్ట్రాలే భరించాల్సి రావటం అదనపు సమస్య. రాష్ట్రాల ఆదాయ వనరులకు గండికొడుతూ కేంద్రం అదనపు భారాన్ని మోపటం సరైనదా అన్నది ఆలోచించాలి. అంతిమంగా పథకం పేరు ఏదైనా ప్రజలకు ప్రయోజనాలు చేకూరితేనే ఫలితం ఉంటుందన్నది వాస్తవం.