calender_icon.png 19 July, 2025 | 8:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అతిపెద్ద మోసం.. కాంగ్రెస్ అభయ హస్తం మేనిఫెస్టో : కేటీఆర్

26-05-2025 07:37:50 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం.. కాంగ్రెస్ ఇచ్చిన అభయ హస్తం మేనిఫెస్టో అని, పార్టీ మారిన పదిమంది సన్నాసులకు ఉపఎన్నికల్లో ప్రజలు కర్రు కాల్చి వాతపెట్టడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలపై జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ, జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు గద్వాల నియోజకవర్గ బీఆర్‌ఎస్ నాయకుడు బాస్ హనుమంతు నాయుడు ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... ఒకనాడు తెలంగాణ ఉద్యమంలో నీళ్ళు, నిధులు, నియామకాలు అనే నినాదం ఉండేది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చాక బీఆర్ఎస్ మీద నిందలు, బిల్డర్లతో దందాలు, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి చందాలు అనే కొత్త నినాదం వచ్చిందని ఆరోపించారు.

తెలంగాణ రైతుల పంట రుణమాఫీకి రూ.49,500 కోట్లు కావాలని అధికారంలోకి వచ్చిన మూడు రోజులకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పితే, ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే రూ.40 వేల కోట్ల రుణమాఫీ చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో చెప్పినట్లు గుర్తు చేశారు. తెలంగాణ క్యాబినెట్ సమావేశంలో రూ.31 వేల కోట్ల పంట రుణమాఫీ అని, అసెంబ్లీలో రూ.26 వేల కోట్ల రుణమాఫీ అన్నారు. రైతుల పంట రుణమాఫీ చేసేందుకు బ్యాంకర్లకు రూ.11 వేల కోట్లు ఇచ్చినట్లు భట్టి చెప్పిండని వెల్లడించారు. రూ. 49,500 కోట్ల రుణమాఫీ చివరకు రూ.11వేల కోట్లకు వచ్చిందని, అది కూడా పూర్తిగా కాలేదని మండిపడ్డారు. పైగా సిగ్గులేకుండా రుణమాఫీ చేసినమని ప్రచారం చేసుకుంటూ తిరుగుతున్నారని కేటీఆర్ కాంగ్రెస్ సర్కార్ పై విరుచుకుపడ్డారు.