24-01-2026 12:29:42 AM
హైదరాబాద్, జనవరి 23 (విజయక్రాంతి): ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ అన్నారు. వ్యక్తిగతంగా హననం చేస్తు న్నారని కేటీఆర్ అనడం హాస్యాస్పదమని ఆయన విమర్శించారు. రాజ్యాంగం ప్రకారం ఫోన్ ట్యా పింగ్‌పై విచారణ జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ కక్ష్య సాధింపు ధోరణి ఉంటే.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే చర్యలు ఉండేవన్నారు.
శుక్రవారం సీఎల్పీ కార్యాలయంలో మహేష్‌కుమార్‌గౌడ్ మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఫోన్ ట్యాపింగ్‌పై కేటీఆర్ ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. పదేళ్ల బీఆర్‌ఎస్ అధికారంలో ఎన్నో అవినీతి, అక్రమాలకు పాల్పపడ్డారని, ఇప్పుడు కేటీఆర్ మాటలు చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఆయన దుయ్యబట్టారు. తోడ బుట్టిన చెల్లెలు కవిత ఫోన్ ట్యాప్ చేశారని గగ్గోలు పెడుతోంటే ఇప్పటి వరకూ ఎందుకు సమాధానం చెప్పడం లేదని ఆయన నిలదీశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు చాలా తీవ్రమైనదని, దీనిని ఉద్యమ కేసులతో పోల్చడం సరికాదని ఆయన హితవు పలికారు. ‘నాపై నిఘా పెట్టీ ట్యాపింగ్ చేశారు’ అని విమర్శించారు. అంతే కాకుండా సినీ తారల ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరమేంటీ..? అని ప్రశ్నించారు, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ దీపం ఆరిపోకుండా చూసుకోవాలన్నారు. ‘కల్వకుంట్ల కవితను నేను చెల్లెలు గా ఎప్పుడూ గౌరవిస్తా.
ఆమెను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోం. బీఆరస్ హయాంలో కేవలం మూడు నెలల్లో 547 ఫోన్లు ట్యాప్ అయ్యాయి. నా మిత్రు డు శైలేష్‌రెడ్డి ఫోన్‌సైతం ట్యాప్ అయ్యింది’ అని వివరించారు. ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ మార్పు ఉండదని స్పష్టం చేశారు. కాళేశ్వరం పై సీబీఐ విచారణ కేంద్రం ఎందుకు చేయడం లేదో కేంద్ర మంత్రి బండి సంజయ్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.