calender_icon.png 27 November, 2025 | 8:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారీ కుంభకోణానికి తెరలేపిన రేవంత్‌ రెడ్డి..

27-11-2025 06:48:41 PM

హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ... రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిలా కాకుండా కేవలం రియల్ ఎస్టేట్ ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి హిల్ట్ పాలసీ పేరుతో మరో భారీ కుంభకోణానికి తెరలేపారని ఆయన ఆరోపించారు. మొదట మూసీ భూములు, ఆ తర్వాత రీజినల్ రింగ్ రోడ్డు, సెంట్రల్ యూనివర్సిటీ భూములపై పడ్డ రేవంత్ దృష్టి… ఇప్పుడు హైదరాబాద్ నగరంలోని పారిశ్రామిక భూములను దోచుకోవడంపై పడిందని విమర్శించారు.

ఒకప్పుడు ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం నుంచి పారిశ్రామికవేత్తలు చవకగా భూములు తీసుకున్నారని, ఇప్పుడు ఆ భూముల్లో అపార్ట్‌మెంట్లు, విల్లాలు కట్టుకునేందుకు రేవంత్ రెడ్డి అతి తక్కువ ధరకే అనుమతులు ఇస్తూ రియల్ దందా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు 9300 ఎకరాల భూమిని ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తూ, 600 వందల మంది బడాబాబులకు కోసం 5 లక్షల కోట్ల రాష్ట్ర ప్రజల ఆస్తిని తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో సగం డబ్బులు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుల జేబుల్లోకి వెళ్తున్నాయని, ఎవరి అబ్బ సొత్తని ఈ భూములను ధారాదత్తం చేస్తున్నారని కేటీఆర్ ప్రశ్నించారు.

ప్రైవేట్ వ్యక్తులకు భూములను అప్పజెప్పే ఈ పాలసీని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు మోసం చేసిందని కేటీఆర్ పేర్కొన్నారు. గత ప్రభుత్వం 24 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 17 శాతం మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుందని విమర్శించారు. బానిసత్వం లేని ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని.. రాష్ట్రం గురించి కోట్లాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్సేనని తెలిపారు. రిజర్వేషన్ల పేరుతో నాటకాలాడుతున్న కాంగ్రెస్ పార్టీకి బీసీ సోదరులు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.