27-11-2025 07:55:49 PM
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి (విజయక్రాంతి): గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రచార పోస్టర్లు, కరపత్రాల ముద్రణలో ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ప్రింటింగ్ ప్రెస్ యజమానులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని ప్రింటింగ్ ప్రెస్ యజమానులతో ఎన్నికల ప్రవర్తన నియమావళిపై సమావేశం నిర్వహించి ఎన్నికల ప్రవర్తన నియమావళిపై అవగాహన కల్పించారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా కరపత్రాలు, పోస్టర్ల ముద్రణలో ప్రింటింగ్ ప్రెస్ యజమానులు పాటించాల్సిన నియమ నిబంధనలపై అవగాహన కల్పించారు. ప్రచార సామాగ్రి అయిన పోస్టర్లు, కరపత్రాల్లో కులం, మతపరమైన అంశాలను ప్రస్తావించరాదని, అదేవిధంగా వ్యక్తిగత విమర్శలు లేకుండా చూసుకోవాలని సూచించారు.
పబ్లిషర్ నుండి ఫారం- ఎ లో డిక్లరేషన్ తీసుకోవాలని, ఫారం ఎ, బి తో పాటు ముద్రించిన 2 కరపత్రాలను జతపరచి కలెక్టరేట్ కు పంపించాలని సూచించారు. ముద్రించిన కరపత్రం లేదా గోడ పత్రిక పై ప్రింటింగ్ ప్రెస్ పేరు, చిరునామా ఖచ్చితంగా పేర్కొనాలని, అంతేకాకుండా పబ్లిషర్ పేరు ఫోన్ నెంబర్ ముద్రించాలన్నారు. ఎన్ని పేజీలు ముద్రించారు, అందుకు తీసుకున్న పైకం ఎంత అనే వివరాలు ఫారం - బి లో చూపెట్టాలని సూచించారు. ప్రింటింగ్ ప్రెస్ యజమానులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. జిల్లా పౌర సంబంధాల అధికారి పి. సీతారాం, సెక్షన్ సూపరింటెండెంట్ మదన్ మోహన్, ప్రింటింగ్ ప్రెస్ యజమానులు తదితరులు పాల్గొన్నారు.