15-12-2025 08:06:54 PM
* బీఆర్ఎస్ కార్యకర్తలారా సమన్వయం పాటించండి
* ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలు ఎక్కువ కాలం నిలబడవు
* కాంగ్రెస్ కు ఓటు అడిగే నైతిక హక్కు లేదు
గరిడేపల్లి (విజయక్రాంతి): హుజూర్‌నగర్ నియోజకవర్గంలో కొందరు ఎస్సైలు చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా పనిచేస్తున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. సోమవారం గరిడేపల్లి మండలం పొనుగోడు, గడ్డిపల్లి, కుతుబ్షాపురం గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేసి భయబ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు. చింతలపాలెం, గరిడేపల్లి పరిధిలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, ఉదయం నుంచి సాయంత్రం వరకు బైండోవర్ కేసులు పెడుతున్నారని తెలిపారు.
తమ నాయకులపై అక్రమ కేసులు పెడితే సహించబోమని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన ఆయన, అరవై ఏళ్ల పాలనలో అభివృద్ధి చేయలేదని, ఇప్పుడు రెండేళ్ల పాలనలోనూ ప్రజలకు ఉపయోగపడే ఒక్క పనీ చేయలేదని అన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి ప్రజలకు కళ్లముందే కనిపిస్తోందని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలనే కాంగ్రెస్ సరిగా అమలు చేయలేకపోతుందని విమర్శించారు. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లకు పిలిపించి ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు.
పలుచోట్ల పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలుగా పనిచేస్తున్నారని, అమాయకులను వేధిస్తున్నారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని, ప్రజావ్యతిరేక ప్రభుత్వాలు ఎక్కువకాలం నిలవవని అన్నారు. కేసీఆర్‌ను వదులుకున్నామన్న పశ్చాత్తాపం ప్రజల్లో మొదలైందని, మరో రెండేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని ప్రజలే చెబుతున్నారని జగదీశ్వర్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో హుజూర్‌నగర్ బీఆర్‌ఎస్ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి, బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, కడియం వెంకట్ రెడ్డి, మాశెట్టి శ్రీహరి, నల్లపాటి భాస్కర్, మేళ్లచెర్వు వెంకటరమణ, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.