15-12-2025 08:02:55 PM
- మైనింగ్ అధికారుల తీరుపై సీపీఐ ఆగ్రహం
- తక్షణమే చర్యలు తీసుకోకపోతే ఆందోళన ఉధృతం
- సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆందోజు రవీంద్ర చారి
ఎల్బీనగర్,(విజయక్రాంతి): ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని మన్సూరాబాద్ డివిజన్ ఆటోనగర్, సర్వే నంబర్ 38లో నిబంధనలకు విరుద్ధంగా, ఎటువంటి అనుమతులు లేకుండా "నమిశ్రీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాజెక్ట్స్" సంస్థ చేస్తున్న అక్రమ మట్టి త్రవ్వకాలపై భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఎల్బీనగర్ నియోజకవర్గ సమితి భగ్గుమంది. అక్రమాలను అరికట్టాలని మైనింగ్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ, సోమవారం ఆటోనగర్‌లోని నిర్మాణ స్థలం వద్ద సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి సామిడి శేఖర్ రెడ్డి అధ్యక్షతన భారీ ధర్నా నిర్వహించారు.
ధర్నాలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కామ్రేడ్ ఆందోజు రవీంద్ర చారి మాట్లాడుతూ... ఆటోనగర్ సర్వే నంబర్ 38లో సుమారు 6 ఎకరాల విస్తీర్ణంలో నమిశ్రీ నిర్మాణ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్ త్రవ్వకాలు చేపట్టిందన్నారు. దాదాపు 88,191 మెట్రిక్ టన్నుల మట్టిని అక్రమంగా త్రవ్వినట్లు సాక్షాత్తు మైనింగ్ రాయల్టీ ఇన్‌స్పెక్టర్లే నిర్ధారించినా, ఇప్పటి వరకు కఠిన చర్యలు లేకపోవడం శోచనీయమన్నారు. సీపీఐ ఎల్బీనగర్ నియోజకవర్గ కార్యదర్శి శేఖర్ రెడ్డి మాట్లాడుతూ.... పోలీసు, రెవెన్యూ, మైనింగ్, జీహెచ్ఎంసీ అధికారుల సమన్వయ లోపంతోనే మట్టి మాఫియా రెచ్చిపోతోందని ఆరోపించారు.
మైనింగ్ అధికారులు నోటీసులు ఇచ్చామంటూ కాలయాపన చేస్తున్నారని, గతంలో విధించిన జరిమానాను కూడా వసూలు చేయడంలో అధికారులు విఫలమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. మైనింగ్ శాఖ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తేనే చర్యలు తీసుకుంటామని పోలీసులు, నోటీసుల పేరుతో మైనింగ్ అధికారులు ఒకరిపై ఒకరు నెపం నెట్టుకుంటూ కాలం వెల్లదీస్తున్నారని మండిపడ్డారు. మైనింగ్, రెవెన్యూ అధికారులు స్పందించకుంటే రాబోయే రోజుల్లో ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.