07-08-2025 05:44:58 PM
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) గురువారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... బీసీల రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తున్నదని అన్నారు. 42% రిజర్వేషన్లు ఇచ్చి రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్నది కాంగ్రెస్ పార్టీ అని, ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినాక బీసీ రిజర్వేషన్లు ఇస్తామని చెప్తున్నాడని అన్నారు. మరి బీసీ డిక్లరేషన్‌లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినాక బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఏమైనా చెప్పిందా..? గతంలో ఢిల్లీకి వెళ్లి తెలంగాణ ఏర్పాటుతోనే తిరిగి వస్తానని కేసీఆర్ ప్రకటించి తెలంగాణ సాధించుకుని తెచ్చిండు.. మరి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి బీసీల రిజర్వేషన్ సాధించిండా లేదా అనేది చెప్పాలి’’ అని కేటీఆర్ మండిపడ్డారు.
ఢిల్లీకి వెళ్లిన తర్వాత కూడా కేసీఆర్ గురించి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడని, కేసీఆర్ పేరు తీయకుండా ఉండలేని మానసిక రుగ్మత రేవంత్ రెడ్డికి ఉన్నట్టు కనిపిస్తుందన్నారు. రేవంత్ రెడ్డికి కేసీఆర్ ఫోబియా పట్టుకుందని, ఒకవైపు బీసీ రిజర్వేషన్ల పేరు చెప్పి కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్న బీసీ డిక్లరేషన్‌లోని ఇతర హామీల అమలును పూర్తిగా పక్కన పెట్టిందని తెలిపారు. బీసీలను మోసం చేస్తున్నావు డ్రామా చేస్తున్నావని నేనంటే.. రేవంత్ రెడ్డి నన్ను మాటలు అంటున్నాడని, మోడీతోని రాహుల్ గాంధీతోని నువ్వు చేస్తున్నది డ్రామా.. చంద్రబాబు కోసం తెలంగాణ ప్రయోజనాలను పక్కన పెడుతు నువ్వు చేస్తుంది డ్రామా.. 420 హామీల అమలు చేయమని అడిగితే రేవంత్ రెడ్డి చేస్తున్నది డ్రామా.. చివరికి కాంగ్రెస్ పార్టీలో చివరిదాకా ఉంటా అని చెప్తున్నా నీ మాటలు డ్రామా.. అని కేటీఆర్ విరుచుకుపడ్డారు.
రేవంత్ రెడ్డి డ్రామాలు చేస్తూ వేరే వాళ్లను విమర్శిస్తున్నాడని, పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారని పేర్కొన్నారు. కండువాలు కప్పుకొని ఇప్పుడు దేవుని కండువాళ్ళు కప్పుకున్నమ్మని.. ఏ పార్టీలో చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నరో రాష్ట్రంలో చిన్న పిల్ల గాడిని అడిగిన చెప్తారని, కానీ శాసనసభ స్పీకర్ కి మాత్రం ఇంకా తెలియడం లేదని తెలిపారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధంగా అయితే ప్రవర్తించరాదో.. ఏ విధంగా అయితే పరిపాలించరాదో.. ఆదేవిధంగా రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడని తెలిపారు. ఇచ్చిన హామీలు వందరోజుల్లో అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత అడిగితే.. నన్నేమి చేసుకుంటారో చేసుకోండి అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడని అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జెడ్పిటిసి కాకముందు మంత్రిగా ఉన్న సబితా రెడ్డికి నిన్న ఆమె నియోజకవర్గంలో ఓడిపోయిన అభ్యర్థిని వేదిక పైన కూర్చోబెట్టి ప్రోటోకాల్ ఉల్లంఘనకు పాల్పడ్డారని కేటీఆర్ తెలిపారు. ’’ఇప్పుడు ఎవరెవరైతే ఎగిరెగిరి కాంగ్రెస్ పార్టీకి వంత పడుతున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు గుర్తుంచుకోవాల్సింది.. ఈ కాంగ్రెస్ పార్టీ ఉండేది ఇంకో రెండున్నర సంవత్సరాలు అని మాత్రమే గుర్తు పెట్టుకోండి.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాట రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ పాడుతున్న ప్రతి ఒక్క అధికారి లెక్క తేలుస్తాము’’ అని కేటీఆర్ సూచించారు. 70 సంవత్సరాలలో చేయని అభివృద్ధిని బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలలోనే చేసిందని, ప్రభుత్వ పాలన నుంచి పరిపాలన వికేంద్రీకరణ దాకా సంక్షేమ పథకాలు అభివృద్ధి దాకా అన్ని రంగాల్లో తెలంగాణను దేశంలో అగ్రగామిగా నిలిపామని తెలిపారు.
కొత్త కలెక్టరేట్లు, మండలాలు, గ్రామాలు ఏర్పాటు చేసి ప్రజల కడప ముందుకు పరిపాలన తీసుకువచ్చిన నాయకుడు కేసీఆర్ అని, కానీ మనం చేసిన అభివృద్ధిని పనిని ప్రజలకు చెప్పుకోవడంలో విఫలమయ్యామన్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్పిన కాకమ్మ కథలను ప్రజలు నమ్మి దుర్మార్గులకు ఓటు వేశారని, కాంగ్రెస్ పార్టీ పరిపాలన వలన మల్లో పది పదిహేనేళ్లు తెలంగాణ వెనక్కి పోతున్నదని పేర్కొన్నారు. తెలంగాణలో కరెంటు కోతలు ఎరువు కొరతలు లైన్లో చెప్పులు పెట్టడం గ్రామాలు సంక్షోభంలోకి పోవడం పట్టణాల్లో పరిపాలన పడకేయడం వంటి అన్ని రకాల అన్యాయాలు తెలంగాణకు జరుగుతున్నాయని తెలిపారు.