16-12-2025 01:14:55 AM
రెండు విడతల్లోనే బీఆర్‌ఎస్ ఖతం కాంగ్రెస్ విప్ వ్యాఖ్యలు
రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 15(విజయక్రాంతి): రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ పూర్తిగా ఖతమైందని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మొదటి, రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఘోర పరాజయాన్ని ఎదుర్కొందన్నారు. రెండు విడతల్లో పోయిన పరువును కాపాడుకునేందుకే కేటీఆర్ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారని విమర్శించారు.
మూడు విడతల ఎన్నికలు పూర్తయ్యాక పెట్టాల్సిన సమావేశాన్ని ముందుగానే నిర్వహించడం కేటీఆర్ ఫ్రస్టేషన్కు నిదర్శనమన్నారు.జిల్లాలో బీఆర్‌ఎస్ పార్టీ 60 స్థానాలకు కూడా చేరలేదని, కానీ 83 స్థానాలు గెలిచామని కేటీఆర్ గొప్పలు చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. నిజంగా 83 సీట్లు గెలిచామని చెబుతున్న కేటీఆర్ వాటి పేర్లు వెల్లడించాలన్నారు. ఓటమిని అంకెల గారడీతో కప్పిపుచ్చే ప్రయత్నమే కేటీఆర్ చేస్తున్నారని ఆరోపించారు.
గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమని ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి కేటీఆర్ ఓర్వలేకపోతున్నారని అన్నారు. 2009లో కేటీఆర్ కేవలం 175 ఓట్ల తేడాతో గెలిచిన విషయాన్ని గుర్తు చేశారు.తాను గెలిచినా ఓడినా ప్రజల మధ్యే ఉంటానని, కేటీఆర్లా ప్రజలను వదిలి పట్టణాలకు పారిపోలేదని వ్యాఖ్యానించారు.
యువరాజుగా రాజకీయాలు చేసిన కేటీఆర్కు 2023 ఎన్నికల్లో మెజారిటీ గణనీయంగా తగ్గిందన్నారు.కేటీఆర్ హత్య రాజకీయాలపై మాట్లాడటం విడ్డూరమన్నారు. వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినందుకు దాడికి యత్నించిన ఘటనపై ముందుగా సమాధానం చెప్పాలన్నారు. మొదటి, రెండో దశల్లో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం సాధించిందని, మూడో దశలో కూడా కాంగ్రెస్దే పైచేయి అవుతుందని ఆది శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు.