17-12-2025 12:50:56 AM
4 వేల కోట్ల అక్రమాల గుట్టు రట్టయ్యేనా?
దమ్ముంటే నిరూపించండి: ఎమ్మెల్యే మాధవరం
ఇది జాగృతి పోరాట ఫలితమే: ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 16 (విజయక్రాంతి): హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న అత్యంత విలువైన ఐడీపీఎల్ భూముల ఆక్రమణ వ్యవహారంపై ప్రభుత్వం కొరడా ఝులిపించింది. కూకట్‌పల్లి పరిధిలోని సర్వే నంబర్ 376లో ఉన్న సుమారు రూ.4 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయన్న ఆరోపణలపై విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది.
ఈ భూ ముల్లో అసలేం జరిగిందో తేల్చాలని, బాధ్యులెవరైనా ఉపేక్షించవద్దని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. కాగా ఐడీపీఎల్‌కు కేంద్ర ప్రభుత్వం గతంలో కూకట్‌పల్లి, బాలానగర్ పరిసరాల్లో భారీగా భూములను కేటా యించింది. అయితే, సంస్థ మూతపడటం, ఖాళీ స్థలాలు ఉండటంతో.. సర్వే నంబర్ 376లోని విలువైన భూములను కొందరు ప్రైవేటు వ్యక్తులు, రియ ల్ ఎస్టేట్ సంస్థలు ఆక్రమించుకున్నాయని, ఇందులో రాజకీయ నేతల హస్తం ఉందన్నది ప్రధాన ఆరోపణ.
నాపై ఆరోపణలు నిరూపించండి: మాధవరం
ప్రభుత్వ నిర్ణయంపై కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పందించారు. ఐడీపీఎల్ భూములపై విజిలెన్స్ విచారణను తాను స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు. విచారణకు ఆదేశించినందుకు సీఎం రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ‘నాపై గత 20 ఏళ్లుగా ఆరోపణలు చేస్తున్నారు. దమ్ముంటే ఈ విచారణలో వాటిని నిరూపించండి’ అని ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు.
గతంలోనే తాను ఈ భూములపై సీబీఐ దర్యాప్తు జరపాలని, లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో ఎంక్వురై చేయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిపారు. తాజా విచారణతోనైనా నిజాలు బయటకు వస్తాయి అని ధీమా వ్యక్తం చేశారు. కాగా గాజుల రామారంలోని సర్వే నంబర్ 307లో పేదల ఇళ్లు కూల్చిన ప్రభుత్వం, శేరిలింగంపల్లిలో బడాబాబులు కబ్జా చేసిన స్థలాలను ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదు అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఇది జాగృతి విజయం: కల్వకుంట్ల కవిత
ఐడీపీఎల్ భూములపై విచారణకు ఆదేశించడం తెలంగాణ జాగృతి విజయమని ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. జాగృతి జనం బాటలో భాగంగా మేడ్చల్ జిల్లాలో పర్యటించినప్పుడు ప్రజలు ఐడీపీఎల్ భూముల ఆక్రమణకు గురయ్యాయని తమ దృష్టికి తెచ్చారని తెలిపారు. ఈ విచారణలో నిజానిజాలు నిగ్గు తేల్చాలని, తద్వారా తమ కుటుం బంపై రాజకీయ కారణాలతో ప్రత్యర్థులు చేసిన తప్పుడు ఆరోపణలు పటాపంచలు అవుతాయని స్పష్టం చేశారు. విచారణ త్వరితగతిన పూర్తి చేసి, ఆక్రమిత భూములను విడిపించి ప్రజలకు పంచాలని డిమాండ్ చేశారు.