16-12-2025 12:01:17 AM
కామారెడ్డి, డిసెంబర్ 15(విజయక్రాంతి): కామారెడ్డి నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలలో గెలిచిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను సోమవారం కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి స్థానిక రాజారెడ్డి గార్డెన్స్ లో నిర్వహించిన బీజేపీ విసృత స్థాయి కార్యకర్తల సమా వేశం అనంతరం సన్మానించారు. కార్యక్రమంలో మొదట ఓటమికి గల కారణాలను, గ్రామాల పరిస్థితులను పోటీ చేసిన అభ్యర్థులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం రమణ రెడ్డి మాట్లాడుతూ కామారెడ్డిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బు, మద్యం లేకుండా ప్రజా సేవ చేసే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చిన వారిని గెలిపించుకోవాలని ప్రయత్నంలో బీజేపీ బలపరిచిన అభ్యర్థులలో గెలుపొందిన వారికి శుభాకాంక్షలు చెబుతూ.. ఓడిన వారు అధైర్య పడొద్దు అని అన్నారు.
డబ్బు, మద్యం లేకుండా గెలిస్తే తన 5 ఏళ్ల పదవి కాలంలో ప్రజలకు సేవ చేసే అవకాశం వస్తుందని, అందుకే బీజేపీ బలపరిచిన అభ్యర్థుల మద్యం, డబ్బు లేకుండా సర్పంచ్ ఎన్నికల్లో పోటో చేసే ప్రయత్నం చేశారని అన్నారు. ఇదే స్పూర్తితో రాబోయే ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా పోటీ చేసి ప్రజల వద్దకు వెళతామని అన్నారు. ప్రజా తీర్పును శిరసావహిస్తామని అన్నారు. అనంతరం వివిధ గ్రామాల్లో గెలిచిన సర్పంచ్, వార్డు సభ్యులను శాలువాతో సన్మానించారు.