26-01-2026 02:40:26 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, జనవరి 25 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిపాలనలో పారదర్శకత ప్రశ్నార్థకంగా మారింది. అధికారుల బదిలీలు ప్రహసనంగా మారాయి. సమర్థత, నిజాయితీ కంటే రాజకీయ అండదండలు, పైరవీలకే పెద్దపీట వేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు, ఏసీబీ విచారణల పరిధిలో ఉన్నవారు సైతం చక్రం తిప్పుతూ, బదిలీ అయిన గంటల వ్యవధిలోనే తిరిగి తమకు నచ్చిన పోస్టింగ్లను దక్కించుకుంటున్న వైనం బల్దియాలో చర్చనీయాంశంగా మారింది.
జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తీసుకుంటున్న నిర్ణయాలు, జారీ చేస్తున్న సర్క్యులర్లు గందరగోళానికి గురిచేస్తున్నాయి. మొదట ఒక అధికారిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం.. రాజకీయ ఒత్తిళ్లు రావడం తోనో, లేక తెరవెనుక ఒప్పందాలతోనో కేవలం రెండు గంటల వ్యవధిలోనే ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకుని కొత్త సర్క్యులర్ జారీ చేయడం పరిపాటిగా మారింది. ఈ వ్యవహారం వెనుక భారీ ఎత్తున దందా నడుస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
బదిలీల పర్వంలో మ్యాజిక్.. అమీన్పూర్ టు అమీన్పూర్ వయా పటాన్‌చెరు..
అమీన్పూర్ డిప్యూటీ కమిషనర్ గా ఉన్న జ్యోతి రెడ్డి వ్యవహారం విస్మయం కలిగిస్తోంది. కమీషనర్ ఆర్వీ కర్ణన్ మొదట జారీ చేసిన ఉత్తర్వుల్లో ఆమెను పటాన్చెరువు డీసీ గా బదిలీ చేశారు. అయితే, ఆ ఉత్తర్వు వెలువడిన గంటల వ్యవధిలోనే సీన్ మారిపో యింది. రాజకీయ ఒత్తిడితో తిరిగి ఆమెను అమీన్పూర్డీసీగానే కొనసాగిస్తూ కమిషనర్ సవరించిన సర్క్యులర్ జారీ చేశారు. గంటల వ్యవధిలో ఆమె బదిలీ ఎందుకు ఆగింది.. ఆమె వెనుక ఉన్న శక్తి ఎవరన్నది ఇప్పుడు ప్రశ్నార్థకం.
హెడ్ ఆఫీస్ ఆర్డర్..చ యూసఫ్ గూడాలో ల్యాండింగ్..
పటాన్చెరు డీసీగా పనిచేస్తున్న సతీష్ విషయంలోనూ ఇదే తంతు నడిచింది. మొదట ఆయన్ను జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి. సాధారణంగా హెడ్ ఆఫీస్‌కి పంపడమంటే లూప్ లైన్ కింద లెక్క. కానీ, రెండు గంటల్లోనే చక్రం తిప్పిన సదరు అధికారి.. ఏకంగా యూసఫ్ గూడా డీసీగా కీలకమైన పోస్టింగ్ దక్కించుకోవడం విశేషం.
సీటు కదలని ఆదిభట్ల డీసీ..
ఆదిభట్ల డీసీగా ఉన్న సత్యనారాయణ రెడ్డిని మొదట యూసఫ్ గూడాకు బదిలీ చేశారు. అయితే, ఆయనకు ఆ స్థానం నచ్చలేదో లేక ఆదిభట్లలోనే ఉండాలని రాజకీయ నేతలు కోరుకున్నారో తెలియదు కానీ, రెండు గంటల్లోనే ఆయన బదిలీ ఉత్తర్వులు రద్దయ్యాయి. తిరిగి ఆదిభట్ల డీసీగానే పోస్టిం గ్ ఇస్తూ కమిషనర్ కార్యాలయం నుంచి మరో ఆర్డర్ వచ్చింది.
అవినీతి మచ్చ ఉన్నా.. అదే కుర్చీ
బడంగ్పేట కార్పొరేషన్ వ్యవహారం అయితే అవినీతికి నిలువుటద్దంగా మారింది. బడంగ్పేట కమీషనర్గా ఉన్న సరస్వతిపై గతంలో అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆమెను ఇటీవలే కమిషనర్ ఆర్వీ కర్ణన్ హెడ్ ఆఫీస్కు సరెండర్ చేశారు. విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిన ఉన్నతాధికారులు.. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గారు. ఆమె తనకున్న పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తో ఏకంగా బడంగ్పేట సర్కిల్కు డిప్యూటీ కమిషనర్ పోస్టును సష్టించుకుని,తెప్పించుకుని మరీ తిరిగి అదే స్థానంలో తిష్టవేయడం గమనార్హం. అవినీతి ఆరోపణలున్న వ్యక్తికి ప్రమోషన్ లాంటి పోస్టింగ్ ఇవ్వడంపై నిజాయితీ గల ఉద్యోగులు విస్తుపోతున్నారు.