calender_icon.png 6 December, 2025 | 3:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒక్క ఎన్నికకు 591 లక్షల ఖర్చా?

06-12-2025 12:00:00 AM

  1. జూబ్లీహిల్స్‌లో ప్రజాధనం దుబారా!
  2. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి విస్తుపోయే నిజాలు
  3. వెంటనే ఆడిట్ నిర్వహించాలి
  4. సీఈవోకు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ

హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 5 (విజయక్రాంతి): గత నెలలో జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నిర్వహణ వ్యయంపై తీవ్ర సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్క నియోజకవర్గం లో ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు ఏకంగా రూ.591.60 లక్షలు అంటూ సుమారు రూ.6 కోట్లు ఖర్చు చేయడం చర్చనీయాంశమైంది. సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు ఎం పద్మనాభరెడ్డి శుక్రవారం రాష్ర్ట ప్రధాన ఎన్నికల అధికారికి లేఖ రాశారు.

ఎన్నికల ఖర్చు వివరాలపై సమాచార హక్కు చట్టం కింద రాష్ర్ట ఆర్థిక శాఖను కోరగా.. ఎన్నికల నిర్వహణ కోసం రూ. 591.60 లక్షలు విడుదల చేసినట్లు అధికారులు సమాధానం ఇచ్చారని పద్మనాభరెడ్డి తెలిపారు. అయితే, ఈ ఖర్చులో భారీగా దుబారా జరిగినట్లు అనిపిస్తోందని ఆయన ఆరోపించారు. ఈ ఎన్నిక కోసం కొత్తగా సిబ్బందిని నియమించడం గానీ, కొత్త వాహనాలు కొనుగోలు చేయడం గానీ జరగలేదు. జూబ్లీహిల్స్ హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ప్రాంతం.

ఇక్కడికి దూరప్రాంతాల నుంచి భారీ ఎత్తున సిబ్బందిని తరలించాల్సిన అవసరం రాలేదు. జూబ్లీహిల్స్ అత్యంత ప్రశాంతమైన ప్రాంతం. ఇక్కడ ఎటువంటి తీవ్రవాద సమస్యలు లేవు. కాబట్టి పెద్ద ఎత్తున పారామిలటరీ బలగాలను మోహరించలేదు. సాధారణంగా ఎన్నికల కమిషన్ చేసే ఖర్చుపై ఆడిట్ ఉండదని, కానీ ఇంత భారీ ఎత్తున ఖర్చు జరిగినప్పుడు ఆడిట్ చేయించాల్సిన బాధ్యత సీఈఓపై ఉందని పద్మనాభరెడ్డి లేఖలో పేర్కొన్నారు.