06-12-2025 12:00:00 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 5 (విజయక్రాంతి): హైదరాబాద్ మహానగర పాలక సంస్థను మెగా సిటీగా మార్చే ప్రక్రియను ప్రభుత్వం శరవేగంగా అమలు చేస్తోంది. 27 మున్సిపాలిటీల విలీనానికి ఆర్డినెన్స్ వచ్చిన వెంటనే యంత్రాంగం అప్రమత్తమైంది. ఒక్కో విలీన స్థానిక సంస్థకు ఒక డిప్యూటీ కమిషనర్‌ను, మానిటరింగ్ కోసం సమీప జోనల్ కమిషనర్లను నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు బుధవారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. వీరంతా క్షేత్రస్థాయిలో విలీన ప్రక్రియను శుక్రవారం సాయంత్రం కల్లా పూర్తి చేయనున్నారు. మరోవైపు, వార్డుల పునర్విభజన పై జీహెఎంసీ భారీ కసరత్తు చేస్తోంది.
ప్రతి 40 వేల జనాభాకు ఒక వార్డు
ప్రస్తుతం ఉన్న 150 వార్డుల సంఖ్యను ఏకంగా 300కు పైగా పెంచేలా అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రస్తుతం 625 చ.కి.మీ విస్తీర్ణంలో ఉన్న జీహెచ్‌ఎంసీలోని 150 వార్డులను జనాభా ప్రాతిపదికన సుమా రు 250 వార్డులుగా పునర్విభజించనున్నారు. కొత్తగా కలుస్తున్న 27 లోకల్ బాడీలను ప్రస్తుతం వీటిలో వందలాది వార్డులు ఉన్నప్పటికీ జీహెచ్‌ఎంసీ ప్రమాణాల ప్రకారం సుమారు 50 వార్డులుగా విభజించే అవకాశం ఉంది.
మొత్తంగా మెగా సిటీలో వార్డుల సంఖ్య 300 దాటనుంది. ప్రతి 40 వేల జనాభాకు ఒక వార్డును ఏర్పాటు చేసే దిశగా ప్రక్రియ కొనసాగుతోంది. వార్డు విభజనలో గందరగోళం లేకుండా.. ఆ ప్రాంతంలోని ప్రధాన నాలాను గానీ, మెయిన్ రోడ్డును గానీ ల్యాండ్ మార్క్‌గా తీసుకుంటున్నారు. అక్కడి నుంచి 40 వేల జనాభా వచ్చే వరకు మార్కింగ్ చేసి వార్డుగా ఖరారు చేస్తున్నారు.
అసెంబ్లీ నియోజకవర్గాలకు లింక్
వచ్చే ఏడాది జరిగే అవకాశం ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనను దృష్టిలో ఉంచుకుని అధికా రులు జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ఒక మున్సిపల్ వార్డు రెండు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోకి రాకుండా జాగ్రత్త పడుతున్నారు. అలాగే, పరిపాలన సౌలభ్యం కోసం ఒక వార్డు రెండు వేర్వేరు సర్కిళ్ల పరిధిలోకి వెళ్లకుండా.. పూర్తిగా ఒకే సర్కిల్ లో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఈ మొత్తం ప్రక్రియను యుద్ధ ప్రాతిప దికన పూర్తి చేయాలని ప్రభు త్వం లక్ష్యంగా పెట్టుకుంది. వార్డుల పునర్విభజన డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను డిసెంబర్ 27 లోపు జారీ చేయనున్నారు. దానిపై వారం రోజుల పాటు ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారు. అనంతరం జనవరి లో జరిగే కౌన్సిల్ సమావేశంలో ఫైనల్ నోటిఫికేషన్‌కు ఆమోదం తెలిపి, ప్రభుత్వానికి పంపించనున్నారు.