25-10-2025 04:43:08 PM
ఏకగ్రీవంగా మండల కన్వీనర్గా ఎన్నికైన లక్కినేని సురేందర్ రావు
టేకులపల్లి (విజయక్రాంతి): రాష్ట్రంలోని బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేసేంత వరకు ఉద్యమాలు చేయాలని టేకులపల్లి మండల బీసీ సంఘాల ఐక్య వేదిక కన్వీనర్ లక్కినేని సురేందర్ రావు పిలుపునిచ్చారు. టేకులపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్ వద్ద బీసీ కుల సంఘాల ఐక్య వేదిక నాయకులు శనివారం 42 శాతం బీసీ రిజర్వేషన్ సాధన కోసం సమావేశమయ్యారు. ముందుగా అడహాక్ మండల కమిటీ కన్వీనర్ గా లక్కినేని సురేందర్ రావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆయనతో పాటు అన్ని కులాల నుంచి ఇద్దరేసి సభ్యులను కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా లక్కినేని మాట్లాడుతూ.. మండల వ్యాప్తంగా తిరిగి బీసీ రిజర్వేషన్ కోసం అందరిని కలుపుకుని పోరాటాన్ని ఉధృతం చేయాలన్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేసేదాకా పోరాడాలన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు దక్కాలంటే రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్‌లో చేర్చాలన్నారు. పార్లమెంట్‌లో బీసీ బిల్లు ఆమోదం పొందేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు. దేశంలో ఎవరు రాజ్యాధికారంలోకి రావాలన్నా అత్యధికంగా ఉన్న బీసీలే కారణమన్నారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం జరిగే పోరాటాల్లో అంతా కలిసి పని చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో అన్ని బీసీ కులాల నాయకులు పాల్గొన్నారు.