15-11-2025 05:29:16 PM
శ్రీదర్ల ధర్మేంద్ర పిలుపు..
హనుమకొండ (విజయక్రాంతి): హైదరాబాదులోని ఇందిరాపార్క్ లో ఈనెల 17వ తేదీన రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే మహాధర్నాను జయప్రదం చేయాలని పెన్షనర్ల సంఘం రాష్ట్ర కో కన్వీనర్, ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు శ్రీధర్ల ధర్మేంద్ర పిలుపునిచ్చారు. అనంతరం ధర్నాకు సంబంధించిన కరపత్రాలను కడారి భోగేశ్వర్, దేవదాసులతో కలిసి హనుమకొండ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ మార్చి 2024 నుండి రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అనేక విజ్ఞాపన పత్రములు అందించిన కానీ, ప్రభుత్వం నుండి ఏ విధమైన స్పందన రాకపోవడంతో సోమవారం రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాదులోని ఇందిరా పార్కులో జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
బకాయిలు అందక రిటైర్డ్ ఉద్యోగులు చాలామంది మానసిక వేదనతో చనిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, మార్చి 2024 నుండి నవంబర్ 2025 వరకు రిటైర్ అయిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రభుత్వం చెల్లించాల్సిన రిటైర్మెంట్ బకాయిలను 20 నెలలు గడిచినా చెల్లించకపోవడం దారుణమని, పెన్షనర్లను మానసికంగా వేధించడమేనని, తీవ్ర అనారోగ్యానికి గురి చేయడం ప్రభుత్వానికి సరియైనది కాదని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు రిటైర్ అయిన ఉద్యోగులకు బకాయిలు చెల్లించకపోవడంతో పెన్షనర్లు పిల్లల పెండ్లి చేయలేక, ఇల్లు కట్టుకోలేక, చేసిన అప్పులు తీర్చలేక, బ్యాంకు ఈయంఐలు చెల్లించలేక వృద్ధ తల్లి దండ్రులను చూసుకోలేక నానా ఇబ్బందులకు గురిఅవుతూ, తమ ఆరోగ్యాన్ని బాగు చేసుకోలేని దయనీయమైన స్థితిలో ఉన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపుగా 26 మంది రిటైర్డ్ అయిన పెన్షనర్లు రిటైర్మెంట్ బకాయిలు రాకపోవడంతో బాధతో, కృంగిపోయి, ఆరోగ్యం క్షీణించి చనిపోవడం జరిగినది. ఇప్పటికైనా రాష్ట్రం ముఖ్యమంత్రి రిటైర్డ్ అయిన 13వేల కుటుంబాలను ఆదుకోవాలని కోరినారు. 17వ తేదీన హైదరాబాదులో ఇందిరా పార్కులో జరిగే ధర్నాకు జిల్లా నుండి అధిక సంఖ్యలో పెన్షనర్లు పాల్గొని జయప్రదం చేయాలని కోరినారు. ఈ కార్యక్రమంలో కడారి భోగేశ్వర్, దేవదాస్, జిల్లా జాయింట్ సెక్రెటరీ ఎండి అబ్దుల్ గఫార్, ఈ. ఇంద్రసేనారెడ్డి పి. సంజీవరెడ్డి, కె.సారయ్య,డాక్టర్ బి. కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.