calender_icon.png 7 May, 2025 | 6:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తుర్కయంజాల్‌లో భూవివాదం

10-04-2025 01:26:29 AM

  1. ఇరువర్గాల మధ్య ఘర్షణలు 

ఒకరిపై మరొకరు దాడులకు తెగ బడిన వైనం 

ఘటనలో ఒక స్కూటీ దగ్ధం, వాహనాలపై దాడులు

అబ్దుల్లాపూర్ మెట్, ఏప్రిల్ 09: రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి కమ్మగూడలో బుధవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కమ్మగూడలోని సర్వే నెంబర్ 240లో 10.09 ఎకరాల భూమి విషయంలో రాజమ్మ అనే ఓ మహిళకు అనుకూలంగా కోర్టు తీర్పు (ఫైనల్ డిగ్రీ) వచ్చింది. దీంతో ఆ భూమి తమదేనంటూ కొన్నాళ్లుగా అక్కడ కబ్జాకు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇప్పటికే ఆ ప్రాంతంలో వెంచర్లు వెలిసి,సుమారు 300 మంది ప్లాట్లు కొని చాలా మంది ఇండ్లు కూడా నిర్మించుకున్నారు. దీంతో ప్లాట్లు, ఇళ్ల యజమానులకు, ఆ మహిళ వర్గానికి సంబంధించిన వారికి గొడవలు జరుగుతున్నాయి. మహిళకు సంబంధించిన వారు 10రోజుల క్రితం ప్లాట్లలో వేసిన కడీలను, ఇతరత్రా నిర్మాణాలను కూల్చారు.

ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున మరోసారి తమకు కోర్టు నుంచి ఉత్తర్వులు ఉన్నాయంటూ పలువురు ప్లాట్ల కడీలు, ఫ్రీ కాస్ట్ గోడలను కూల్చివేసేందుకు ప్రయత్నించారు.దీంతో అప్పటికే ఇండ్లు నిర్మించుకొని ఉన్న స్థానికులు, ప్లాట్ల యజమానులు ప్లాట్ల హద్దు చేరిపే వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాలు తీవ్రంగా ప్రతిఘటించడంతో ఉద్రిక్తతకు దారితీసింది.

పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఘర్షణలో పలువురు గాయపడ్డారు. స్థానికులు పెద్ద ఎత్తున తిరగబడటంతో అక్కడికి వచ్చిన మహిళ చెందిన వ్యక్తులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. గొడవ జరుగుతున్న సమయంలోనే ఆందోళనకారులు అక్కడికి వచ్చి గొడవకు దిగిన వారి ప్రవేట్ బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. స్కూటీ కి నిప్పు పెట్టారు మరో బైక్ ధ్వంసం అయ్యింది. జెసిబి అద్దాలు పగలగొట్టారు. 

ఘటన స్థలానికి ఆలస్యం చేరుకున్న పోలీసులు

ఇంతలా పెద్ద ఎత్తున గొడవ జరుగుతుండగా పోలీసులు ఆలస్యంగా అక్కడికి చేరుకున్నారని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు.తమపై గుర్తు తెలియని వ్యక్తులు దాడులు చేస్తుంటే కాపాడాల్సిల పోలీసులు ఆలస్యంగా వచ్చారని దీంతో తమకు గాయాలు కూడా అయ్యాయని స్థానికులు చెబుతున్నారు.