26-05-2025 08:51:54 PM
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి..
నల్లగొండ (విజయక్రాంతి): జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా జిల్లాకు మంజూరైన 22 ఆరోగ్య ఉప కేంద్రాలకు తక్షణమే స్థలాలను కేటాయించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి(District Collector Ila Tripathi) అధికారులను ఆదేశించారు. సోమవారం ఆమె కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జాతీయ ఆరోగ్య మిషన్(National Health Mission) కింద నూతనంగా మంజూరైన 22 ఆరోగ్య ఉప కేంద్రాలు, గతంలో మంజూరై పనులు మొదలుపెట్టిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప ఆరోగ్య కేంద్రాలు, ఆస్పత్రుల పురోగతిపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వారం రోజుల్లో 22 నూతన సబ్ సెంటర్ లకు స్థలాలను గుర్తించి కేటాయించాలని, ఇందుకు తక్షణమే ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు.
ఈ విషయానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. గతంలో జిల్లాకు జాతీయ ఆరోగ్య మిషిన్ కింద 164 ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లు, ఆసుపత్రులు మంజూరు కాగా, వాటిలో 143 భవనాల నిర్మాణాలు ప్రారంభమై వివిధ స్థాయిలలో ఉన్నాయి. నిర్మాణంలో ఉన్న భవనాలన్నింటిని త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఇంకా పనులు మొదలుపెట్టని 21 భవనాలకు పనులు తక్షణమే ప్రారంభించాలని చెప్పారు. దీంతోపాటు, ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాలు, ఆసుపత్రులను త్వరితగతిన ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డిసిహెచ్ఎస్ మాతృనాయక్, సూపరింటెండెంట్ ఇంజనీర్ రామచంద్రారెడ్డి, ఉప వైద్య ఆరోగ్య అధికారులు, టిఎస్ఎంఐడిసి ఇంజనీరింగ్ అధికారులు, డిప్యూటీ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు, తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.