16 June, 2026 | 2:37 AM

దళితులు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలను ఇవ్వాలి

16-06-2026 01:34 AM

సీపీఐ (ఎం ఎల్ ) మాస్ లైన్ (ప్రజాపంథా) పార్టీ డిమాండ్

బోధన్, జూన్15 (విజయక్రాంతి): బోధన్ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం ముందు సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ (ప్రజాపంథా) పార్టీ, అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘంల ఆధ్వర్యంలో సాలూర మండలంలోని తగ్గేల్లీ, ఖాజాపూర్ గ్రామాలకు చెందిన దళితులు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని  సోమవారం రోజున ఉదయం ధర్నా చేసి ఆర్డీవో కి వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కే. గంగాధర్, సీపీఐ (ఎం-ఎల్) మాస్ లైన్ (ప్రజా పంథా)  బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి బి. మల్లేష్ లు మాట్లాడుతూ... బోధన్ డివిజన్ పరిధిలోని మండలంలోని ఖాజాపూర్ తగ్గేల్లి గ్రామంలోని పేద దళిత కుటుంబాలకు చెందిన వారు ఖాజాపూర్ లో సీలింగ్ భూమి మూడు దళిత కుటుంబాలు గత 25 సంవత్సరాలుగా, తగ్గేల్లీలో 8 కుటుంబాల దళితులు గత తొమ్మిది సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నాప్పటికీ వారికి ఇప్పటికీ పట్టాలు ఇవ్వకపోవడంతో రైతు బంధు, బ్యాంకులో రుణ సదుపాయం, సాగుకు ముందు విత్తనాలు ఎరువులు కంట పండిన తర్వాత దిగుబడిని అమ్మడం తదితర ప్రతియోజనాలను పొందలేకపోతున్నారని అందుకని వెంటనే వీరికి పట్టా పాస్ బుక్కులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సి.పి.ఐ (ఎం-ఎల్) మాస్ లైన్ ప్రజా (పంథా) పార్టీ మండల కార్యదర్శి పడాల శంకర్, అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు జి. దేవయ్య, సి హెచ్. రమేష్, లాలయ్య, గంగారాం, బి. సాయిలు, లక్ష్మణ్, కే.గంగాధర్ అబ్బయ్య, సి.హెచ్ రాములు తదితరులు పాల్గొన్నారు.