calender_icon.png 16 September, 2025 | 3:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పూడికతీత పనులు వేగవంతం చేయాలి

16-09-2025 01:18:19 AM

  1. జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్
  2. మల్లేపల్లి నాలాను పరిశీలించిన కమిషనర్  

హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి):భారీ వర్షాల నేపథ్యంలో నగరంలోని నాలాల ప్రక్షాళనపై జీహెఎంసీ ప్రత్యేక దృష్టి సారించింది. లోతట్టు ప్రాంతాల్లో ముంపు సమస్యను నివారించేందుకు క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో, సోమవారం జీహెఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్  ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతితో కలిసి మెహదీపట్నం సర్కిల్ పరిధిలోని మల్లేపల్లి నాలాను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నాలాలో పేరుకుపోయిన మట్టి, పూడికను తక్షణమే తొలగించే పనులను వేగవంతం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. దీనివల్ల భారీ వర్షాలు కురిసినప్పుడు కూడా వరద నీరు సాఫీగా ప్రవహించి, సమీప బస్తీలు ముంపునకు గురికాకుండా ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.

అవసరమైన చోట్ల నాలాలకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతో పాటు, పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వర్షపు నీరు ఎక్కడా నిల్వకుండా, నాలాలో స్వేచ్ఛగా ప్రవహించేలా ఇంజనీరింగ్, శానిటేషన్ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆర్‌వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు.