10-05-2025 01:10:03 AM
మహబూబాబాద్, మే 9 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో వ్యవసాయ భూములను ప్రభుత్వ అనుమతి లేకుండా ప్లాట్లు చేసి విక్రయిస్తున్నారు. ఇష్టానుసారంగా ‘లే’అవుట్ చేయకుండా ప్లాట్ లను విక్రయిస్తూ అమాయకులకు అంటగడుతున్నారు. జిల్లా కేంద్రం, మున్సిపల్, మండల కేంద్రాలతో గ్రామాల్లో సైతం రియల్ ఎస్టేట్ దందా జోరుగా సాగుతోంది. అనేకచోట్ల లే అవుట్ చేయకుండా వ్యవసాయ భూములను గజాలుగా విభజించి ప్లాట్లు చేసి విక్రయిస్తున్నారు.
నిబంధనల ప్రకారం జిల్లా, పట్టణ కేంద్రాల్లో ప్లాట్లు విక్రయించాలంటే వ్యవసాయ భూమికి ముం దుగా నాలా కన్వర్షన్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం రెవెన్యూ శాఖకు భూమి విలువలో కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం నాలా కన్వెన్షన్ అయిన భూమిని రియల్ ఎస్టేట్ చేయాలంటే టౌన్ ప్లానింగ్, రేరా సంస్థల ద్వారా అనుమతి కోసం దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
ప్రతి రియల్ ఎస్టేట్ స్థలంలో కొంత గ్రీన్ ల్యాండ్ కోసం కేటాయించి మిగిలిన స్థలంలో నిర్ణీత కొలతల ప్రకారం ప్రధాన , అంతర్గత రోడ్లకు కేటాయించిన తర్వాత టౌన్ ప్లానింగ్, రేరా సంస్థల అనుమతి పొంది ప్లాట్లను విక్రయించాల్సి ఉంటుంది. అయితే మహబూబా బాద్ జిల్లాలో అనేక చోట్ల ఇవేవీ పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వ్యవసాయ భూమిని ప్లాట్ చేసి విక్రయిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నిబంధనల ప్రకారం కనీసం ప్రధాన, అంతర్గత రోడ్లకు స్థలం కేటాయించకపోవడం తో పాటు గ్రీన్ ల్యాండ్ కోసం సెంటు భూమి కేటాయించకుండా ప్లాట్లు చేసి విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా కేంద్రంగా ఏర్పడడం, జిల్లాలో తొర్రూరు, డోర్నకల్, మరిపెడ తో పాటు ఇటీవల కేసముద్రం మున్సిపాలిటీగా ఏర్పడ్డాయి. దీనితో రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది.
అయితే గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలంటే వరంగల్ పట్టణాభివృద్ధి సంస్థ ‘కూడా’ అనుమతి పొందాల్సి ఉండేది. ఇప్పుడు మహబూబాబాద్ జిల్లా కేంద్రం ఏర్పడడంతో పాటు ఇక్కడే అన్ని అనుమతులు పొందే అవకాశం అందుబాటులోకి వచ్చింది.
అయినప్పటికీ కొందరు రియల్ ఎస్టేట్ యజమానులు ఇవేవీ పట్టించుకోకుండా వ్యవసాయ భూములను ప్లాట్లుగా విభజించి విక్రయిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. కొందరైతే కనీసం నాలా కన్వర్షన్ కూడా చేయకుండా ప్లాట్లు విక్రయిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి.
ఫామ్ లాండింగ్ వెంచర్ల జోరు
జిల్లాలో పలుచోట్ల ఫామ్ లాండింగ్ వెంచర్ల జోరు పెరిగింది. వ్యవసాయ భూములను రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి, అందులో ప్లాటు చేసి ఒక్కో ప్లాట్ లో వివిధ రకాల మొక్కలు నాటి అవి మూడేళ్లలో పెరుగుతాయని, అలాగే ప్లాట్ విలువ కూడా ఊహించని అంతగా పెరుగుతుందని నమ్మిస్తూ, రెవిన్యూ శాఖ ద్వారా పట్టా పాస్ పుస్తకం ఇప్పిస్తామని, దీనితో రైతు బీమా సౌకర్యం కూడా ఉంటుందని నమ్మిస్తున్నారు.
వీరి మాటలు నమ్మి ఒక్కో గుంట భూమికి ఐదు నుంచి పది లక్షల రూపాయలు వెచ్చించి ఖరీదు చేస్తుండగా, ఆ భూమిని వ్యవసాయ భూమి గానే పేర్కొంటూ స్థానిక తహసిల్దార్/ సబ్ రిజిస్టార్ ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తూ పట్టా పాస్ పుస్తకాలు ఇప్పిస్తున్నారు. అయితే ఇలా కనీసం భూముల్లో భవిష్యత్తులో ఇండ్లు నిర్మించాలంటే అనేక ఇబ్బందులు ఎదుర్కొక తప్పదు.
డోర్ నెంబర్లతో విక్రయాలు?
జిల్లావ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్లాట్లుగా చేసిన స్థలాన్ని డోర్ నంబర్ల ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తూ విక్రయిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. వ్యవసాయ భూములను సొంతంగా ‘ప్లాన్’ తీయించి ఇష్టానుసారంగా ప్లాట్లు విక్రయిస్తున్నారు.
వ్యవసాయ భూమిలో ఒకచోట రేకుల షెడ్డు వేసి స్థానిక పంచాయతీ, మున్సిపాలిటీ నుంచి దొడ్డి దారిలో డోర్ నెంబర్ తీసుకొని అదే ఇంటిని చూపిస్తూ తాము చేసిన వెంచర్ లోని ప్లాట్లను కొనుగోలుదారులకు విక్రయించి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. దీనితో ప్లాట్లు కొన్న చాలామందికి ఓకే డోర్ నెంబర్ అలాట్ అవుతోంది. ఫలితంగా భవిష్యత్తులో గృహ నిర్మాణానికి అనుమతి లభించే పరిస్థితి లేకుండా పోయే ప్రమాదం ఏర్పడింది.
ఎల్‌ఆర్‌ఎస్ కు దూరమే!
అనుమతి లేకుండా చేపట్టిన ఫామ్ లాండింగ్, రియల్ ఎస్టేట్ వెంచర్లలో ప్లాట్లుకొన్న వారు ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ల్యాండ్ రెగ్యులర్ స్కీమ్ (ఎల్‌ఆర్‌ఎస్) కు ఆసక్తి చూపడం లేదు. రియల్ ఎస్టేట్ చేసిన వారి మాటలు నమ్మి ప్లాట్లు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నామని, మళ్లీ ఎల్‌ఆర్‌ఎస్ ఎందుకు అంటూ చాలామంది ప్రశ్నిస్తున్నారు.
తమకున్న భూమి సక్రమంగానే ఉందని, సక్రమంగా లేకపోతే రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. దీనితో జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా చేపట్టిన వెంచర్ల లో భూములు కొనుగోలు చేసిన వారు ఎల్‌ఆర్‌ఎస్ ద్వారా భూములను రెగ్యులర్ చేసుకోవడానికి ముందుకు రావడంలేదని ఆరోపణలు వస్తున్నాయి.
పట్టించుకోని అధికారులు?
జిల్లా, మున్సిపాలిటీ, మండల, గ్రామస్థాయిలో ఎలాంటి అనుమతి లేకుండా వెంచర్లు చేసినప్పటికీ సంబంధిత శాఖల అధికారులు పట్టించుకోవడంలేదనే విమర్శలు వస్తున్నాయి. ఆరోపణలు, ఫిర్యాదులు వచ్చినప్పుడు మొక్కుబడిగా లేఅవుట్ లేకుం డా ప్లాట్లు కొనవద్దని అక్కడక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం తప్ప బహిరంగంగా ప్లాట్లు విక్రయిస్తుంటే అడ్డుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
అలాగే ఎల్‌ఆర్‌ఎస్ పథకాన్ని వినియోగించుకునేందుకు కూడా ప్రజల్లో అవగాహన కల్పించలేకపోతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఎక్కడికక్కడే రియల్ ఎస్టేట్ చేసిన వెంచర్లపై విచారణ జరిపి, అనధికారికంగా విక్రయాలు చేసిన ప్లాట్ల యజమానులకు ఎల్ ఆర్ ఎస్ పై అవగాహన కల్పించడం, అక్రమంగా వెంచర్లు చేసిన వారిని గుర్తించి, నిర్ణీత కొలతల ప్రకారం ప్రధాన, అంతర్గత రోడ్లను వేయించడం, గ్రీన్ ల్యాండ్ల కోసం స్థలం కేటాయించేలా చర్యలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.