calender_icon.png 1 October, 2025 | 3:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

32 ఏళ్ల సేవకు సెలవు

01-10-2025 02:21:56 AM

  1. డీజీపీ జితేందర్ పదవీ విరమణ

పోలీస్ అకాడమీలో అట్టహాసంగా వీడ్కోలు పరేడ్

తల్లిని గుర్తుచేసుకొని కన్నీటిపర్యంతమైన జితేందర్ 

హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): ఉమ్మడి ఏపీతో పాటు ప్రత్యేక తెలంగాణకు కలిపి పోలీస్ శాఖకు 32 ఏళ్ల పాటు నిబద్ధతతో సేవలందించి, వినూత్న సంస్కరణలతో విభాగాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపిన డీజీపీ జితేందర్ మంగళవారం పదవీ విరమణ పొందారు. హిమాయత్‌సాగర్‌లోని తెలంగాణ రాష్ర్ట పోలీస్ అకాడమీలో ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు.

పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఆయన ప్రసంగిస్తూ.. “వృత్తి జీవితంలోని విజయాలను, వ్యక్తిగత జీవితంలోని త్యాగాలను గుర్తుచేసుకుని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. గత 15 నెలల నా పదవీకాలం లో శాంతిభద్రతలను పూర్తిస్థాయిలో అదుపులోకి తేగలిగాం. రాష్ర్టవ్యాప్తంగా నేరాల రేటును తగ్గించేందుకు అనేక చర్యలు చేపట్టాం.

దీని ఫలితంగానే ఇండియా జస్టిస్ రిపోర్ట్ ప్రకారం తెలంగాణ పోలీస్ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది” అని ప్రకటించారు. నార్కోటిక్స్, సైబర్ క్రైమ్‌లపై నిరంతరం యుద్ధం చేశామని, బెట్టింగ్ మాఫియాపై దేశవ్యాప్తంగా దాడులు చేసి నిందితులను అరెస్టు చేశామని తెలిపారు. రాష్ర్టంలోని 10 లక్షల సీసీ కెమెరాల నిఘా, టెక్నాలజీ వినియోగంతో సంచలనం సృష్టించిన అనేక కేసులను 48 గంటల్లోనే ఛేదించా మని అన్నారు.

కామారెడ్డి, నిజామాబాద్ వరదల సమయంలో పోలీసులు ప్రాణాలకు తెగించి ప్రజలను కాపాడారని గుర్తు చేశారు. వృత్తిపరమైన బాధ్యతల నడుమ కుటుంబానికి, బంధువులకు సమయం కేటాయించలేకపోయానని జితేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తన తల్లిదండ్రులను గుర్తుచేసుకుని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ముఖ్యంగా తన తల్లిని తలచుకుని కన్నీళ్లు పెట్టుకోవడం అక్కడున్న వారిని కదిలించింది.

ఇన్నాళ్లు తనకు అండగా నిలిచిన కుటుంబ సభ్యులకు, మిత్రులకు ఆయ న కృతజ్ఞతలు తెలిపారు. పదవీ విరమణకు ముందు డీజీపీ కార్యాలయంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో మాట్లాడుతూ.. పోలీసులు ఎల్లప్పుడూ ప్రజావసరాలకు తగ్గ పోలీసింగ్ సిటిజన్ సెంట్రిక్ పోలీసింగ్ అందించాలని సిబ్బందికి సూచించారు. జితేందర్ హయాంలో క్యూఆర్ కోడ్ ఫీడ్‌బ్యాక్, టూరిజం పోలీసింగ్, యంగ్ ఇండి యా స్కూల్స్ వంటి కార్యక్రమాలు చేపట్టారని అదనపు డీజీ మహేశ్ భగవత్ కొనియా డారు. కార్యక్రమానికి డీజీపీగా బాధ్యతలు చేపట్టనున్న శివధర్‌రెడ్డి హాజరయ్యారు.