01-10-2025 02:16:49 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): గత పది రోజులుగా తెలంగాణ పల్లెపల్లెనా, వాడవాడలా పూల పరిమళాలను వెదజల్లిన బతుకమ్మ సంబురాలు చివరి అంకానికి చేరుకున్నాయి. పూల పండుగకు ముగింపు పలుకుతూ, మంగళవారం సద్దుల బతుకమ్మ వేడుకలను రాష్ర్ట ప్రభుత్వం హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై అత్యంత వైభవంగా నిర్వహించింది.
తీరొక్క పూలతో అందంగా పేర్చిన భారీ బతుకమ్మలను తలపైకెత్తుకుని వేలాది మంది ఆడప డుచులు తరలిరావడంతో ట్యాంక్‌బండ్ పూల సంద్రంగా మారింది. డప్పుల చప్పు ళ్లు, బతుకమ్మ పాటల హోరుతో హుస్సేన్‌సాగర్ తీరం మార్మోగిపోయింది. సంబురా లు ప్రారంభానికి ముందు మహిళలు అమరవీరుల స్థూపం వద్దకు చేరుకుని తమ బతు కమ్మలతో తొలిపూజ నిర్వహించి, తెలంగాణ అమరులకు నివాళులర్పించారు.
అనంతరం అక్కడి నుంచి 700 బతుకమ్మలతో ట్యాంక్‌బండ్‌పై ఉన్న బతుకమ్మ ఘాట్ వరకు భారీ ర్యాలీగా తరలివచ్చారు. దారిపొడవునా 500 మందికి పైగా కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, జానపద నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. సద్దుల బతుకమ్మ వేడుకల కోసం ప్రభుత్వం ట్యాంక్‌బండ్‌ను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసింది. గ్రాండ్ ఫ్లోరల్ పరేడ్, హుస్సేన్‌సాగర్‌లో రంగురంగుల కాంతులతో తేలియాడిన బతుకమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
సచివాలయంపై 3డీ మ్యాపింగ్ లేజర్ షోతో బతుకమ్మ చరిత్రను, తెలంగాణ సంస్కృతిని ప్రదర్శించి అబ్బురపరిచారు. హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్నివాల్, తెలంగాణ రుచులతో కూడిన ఫుడ్ స్టాళ్లు సందర్శకులను ఆకట్టుకున్నాయి.
ఈ వేడుకలకు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడు తూ.. “తెలంగాణ ఏర్పడ్డాక, ప్రజా ప్రభుత్వం లో నిర్వహిస్తున్న ఈ బతుకమ్మ వేడుక చరిత్రలో నిలిచిపోతుంది. పువ్వులను పూజించే గొప్ప సంస్కృతి మనది. ఈ పండుగను గిన్నిస్ బుక్‌లో ఎక్కించాలనే తపనతో ప్రపంచవ్యాప్తం చేశాం” అన్నారు.