01-10-2025 01:13:48 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యుల్ విడుదల చేయడంతో గ్రామాల్లో రాజకీయాలు వేడె క్కాయి. పల్లెల్లో పట్టు సాధించుకునేందుకు రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. మెజార్టీ సీట్లు సాధించుకోవడమే లక్ష్యంగా ఎత్తుగడలతో ముందుకు సాగనున్నాయి. మొదటగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు జరగనుండటంతో నెలన్నర పాటు గ్రామా ల్లో ఎన్నికల వాతావరణం కనిపించనుంది.
ఆ తర్వాత మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు కూడా నిర్వహించే అవకాశం ఉంది. దీంతో రాజకీయ పార్టీలన్నీ విమర్శలు, ప్రతి విమర్శలకు కత్తులునూరుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీకి కొంత మేర కలసివ స్తాయి. చేసిన అభివృద్ధి, సంక్షేమంతో పాటు భవిష్యత్‌లో చేయాల్సిన పనులు చెప్పుకోవడానికి అధికార పక్షానికి అవకాశం ఉం టుంది. ఇక ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వ వైఫల్యాలు, అమలుకాని ఎన్నికల హామీలపై ప్ర భుత్వాన్ని ప్రశ్నిస్తూ ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తుంటాయి.
హస్తం పార్టీకి ప్రచార అస్త్రాలు..
ఇక అధికార కాంగ్రెస్ పార్టీ, స్థానిక ఎన్నికల్లో విజయం సాధించేందుకు పటిష్టమైన ప్రణాళికలు రచిస్తున్నది. ఒక వైపు పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతానికి చర్యలు తీసుకుంటూనే మరో వైపు బీఆర్‌ఎస్, బీజేపీపైన విమర్శల జోరు పెంచు తోంది. అయితే గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కాళేశ్వరం, ఫార్ములా ఈ కారు రేసులో అవినీతి జరిగిందని, విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. బీఆర్‌ఎస్ హయాంలో రూ. లక్ష కోట్లకు పైగా అవినీతి జరిగిందని విమర్శలతో పాటు బీఆర్‌ఎస్, బీజేపీ ఒక్కటేనని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తోంది.
పార్టీ అధికారంలోకి వచ్చాక అమలుచేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రచారాస్త్రాలుగా మల్చుకోవాలని భావిస్తున్నది. ప్రధానంగా రైతు రుణమాఫీ, రైతు భరోసా, సన్న వరికి రూ. 500 బోనస్ , ధరణి స్థానంలో భూమాత పోర్టల్ తీసుకురావడం వంటి అంశాలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రభావం చూపుతాయని అధికార కాంగ్రెస్ పార్టీ అం చనా వేస్తున్నది.
దీంతోపాటు ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత గృహవిద్యుత్, రూ. 500 లకే గ్యాస్, రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ వంటి అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నిర్ణయించింది. అంతేకాకుండా గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన, ఫోర్త్ సిటీకి ఫౌండేషన్, ఓఆర్‌ఆర్, ఆర్‌ఆర్‌ఆర్ మధ్య అభివృద్ధి, మూసీ నదీ ప్రక్షాళన, ఇం టిగ్రేటెడ్ స్కూల్స్ వంటి కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్తామని కాంగ్రెస్ నేత లు చెబుతున్నారు.
ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశాన్ని కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నిర్ణయిం చారు. అయితే యూరియా సమస్యపై క్షేత్రస్థాయిలో కొంతమేర వ్యతిరేకత వచ్చినప్ప టికి.. కేంద్రంతో ఎప్పటికిప్పుడు సంప్రదింపులు నిర్వహించి యూరియా సమస్యను చాలా వరకు పరిష్కరించినట్టు భావిస్తున్నారు.
‘బాకీ కార్డు’తో బీఆర్‌ఎస్ ప్రజల్లోకి..
ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్ కూడా పార్టీ శ్రేణులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూనే ఉంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా సమస్యలపై నిరంతరం క్షేత్రస్థాయిలో ఉంటూ పార్టీ కేడర్‌కు దిశానిర్దేశం చేస్తోంది. బీఆర్‌ఎస్ అధికారం కోల్పోయాక .. ఆ తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటు గెలుచుకోకపోవడంతో కొంతకాలం స్థబ్దతగా ఉన్నప్పటికి.. ఇప్పుడు ప్రభు త్వంపై విమర్శలు జోరు పెంచింది.
ప్రభు త్వం తీసుకొచ్చిన హైడ్రాతో పేదల బతుకులు ఆగమైనాయని, యూరియా కొరతను తీర్చడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని క్షేత్ర స్థాయిలో ఆందోళలను చేపడుతూ పార్టీలో మరింత కదలిక తీసుకొచ్చే ప్రయ త్నం చేస్తున్నారు. మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ గజ్వేల్‌లోని తన వ్యవసాయ క్షేత్రం నుంచే పార్టీ శ్రేణులను ఎన్నిక లకు సన్నద్ధం చేస్తున్నారు.
ఇక కేటీఆర్, హరీశ్‌రావుతో పాటు పార్టీ ముఖ్య నేతలు నిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తు న్నారు. తద్వారా పార్టీ శ్రేణులను పనిలో పెడుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయడంలో ప్రభుత్వం విఫలమైందని ‘బాకీ కార్డు’ పేరుతో వినూత్న కార్యక్ర మాన్ని బీఆర్‌ఎస్ చేపట్టింది. యూరియా కొరతతో రైతులు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, అది తమకు స్థానిక సం స్థల ఎన్నికల్లో కలిసి వస్తుందనే అభిప్రాయం తో గులాబీ నేతలున్నారు.
సత్తా చాటాలనే లక్ష్యంతో కమల దళం ..
లోకల్‌బాడీ ఎన్నికల్లో ఈసారి సత్తా చాటాలని కమల దళం ఉవ్విళ్లూరుతోంది. ఎన్నికల హామీలు నేరవేర్చడం, ప్రజా సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీనే అంటూ ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. గ్రామాల్లో యువత మెజార్టీగా బీజేపీనే ఆదరిస్తున్నారని, పంచాయతీల్లో మెరుగైన స్థానాలు వస్తాయనే అంచనాతో ఉన్నారు.
20 నెలల కాంగ్రెస్ పాలనలో గ్రామాలకు చేసిందేమి లేదని, ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలకు కేంద్ర వాటా ఉందన్న విషయాన్ని ప్రజలకు వివరించనున్నారు. వీటితో పాటు జాతీయ రహదారులు, కేంద్రం నిధులతోనే జాతీయ ఉపాధి హామీ పనుల వంటివి అమలవుతున్నాయనే విషయాన్ని ప్రజలకు వివరించాలనే ఆలోచనతో ఉన్నారు. అసెంబ్లీలో 8 మంది ఎమ్మెల్యేలతో పాటు 8 మంది ఎంపీలు కూడా ఉన్నందున ఆయా నియోజక వర్గాల్లో బీజేపీకి అనుకూల పవనాలు వీస్తాయని ఆ పార్టీ నాయకులు ఆశిస్తున్నారు.
టికెట్ల కోసం మొదలైన ప్రయత్నాలు..
స్థానిక ఎన్నికల్లో టికెట్ సాధించేందుకు ప్రధాన పార్టీలకు చెందిన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు తమ ప్రయత్నాలను స్పీడప్ చేశారు. రాష్ర్ట పార్టీ ముఖ్య నేతల దగ్గర లాబీయింగ్ పెరిగినట్టు తెలుస్తున్నది. రిజర్వేషన్ల ప్రకారం తమకు కలిసి వచ్చే ఆయా సామాజికవర్గాల నేతలు టికెట్లపై తమ వాదనలు పార్టీ ముఖ్యల దగ్గర వినిపిస్తూ టికెట్లు తమకే ఇవ్వాలని విజ్ఞప్తులు చేసుకుంటున్నారు.
రిజర్వేషన్ల ద్వారా ఈసారి జనరల్ స్థానాలు తగ్గడంతో ఆ సీట్లపై భారీఎత్తున ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ప్రధానంగా అధికార పార్టీలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ బంధువులు, వారసులను రంగంలోకి దింపేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీలు గ్రామాల్లో పట్టున్న నాయకులను బరిలో దింపాలనే ఆలోచనతో ఉన్నారు. అన్ని పార్టీలకు చెందిన ఆశావాహులు మాత్రం గ్రామాల్లో వివిధ కార్యక్రమాలకు హాజరవుతూ గత కొన్ని నెలలుగా హడావుడి చేస్తున్నారు.