14-09-2025 01:44:20 AM
చట్టసభల్లో చర్చలు నిర్మాణాత్మకంగా ఉండాలి..
స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్
హైదరాబాద్, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): ప్రజాస్వామ్యంలో చట్టసభలు ప్రజ లకు దేవాలయాలని, సభికుల చర్చలు ప్ర జల ఆకాంక్షలకు ప్రతీకలని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అభివర్ణించారు. బెంగళూరులో శనివారం 11వ కామన్‌వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ఇండియా రీజియన్ కాన్ఫరెన్స్‌కు ఆయన తెలంగాణ తర ఫున ప్రాతినిధ్యం వహించారు.
ఈ సందర్భంగా ఆయన ‘ప్రజల నమ్మకాన్ని పెం పొందించేందుకు చట్టసభల కృషి ప్రజల ఆకాంక్షల సాకారం’ అనే అంశంపై మాట్లాడారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల మొదటి కర్తవ్యం ప్రజల గొంతుకగా పనిచేయడమేనని స్పష్టం చేశారు. చట్టసభల్లో నిర్మాణాత్మకంగా చర్చలు ఉండాలని, ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలని ఆకాం క్షించారు. అర్థవంతమైన చర్చలు న్యాయమైన చట్టాల రూపకల్పనకు ఉపకరిస్తాయని అభిప్రాయపడ్డారు.
ఒక స్పీకర్‌గా తాను ప్ర జా సమస్యలపై చర్చించేందుకు సభ్యులకు అవసరమైన సమయం ఇస్తున్నానని, తద్వా రా కొత్త సభ్యులను ప్రోత్సహిస్తున్నామని వివరించారు. దీనిలో భాగంగానే ఇటీవల కొత్త సభ్యులకు శిక్షణ తరగతులు నిర్వహించామని తెలిపారు. శిక్షణ తర్వాత తమకు కేటాయించిన సమయాన్ని సభ్యులు సమర్థంగా వినియోగిస్తున్నారని వెల్లడించారు.
ప్రజలకు ప్రాథమిక వసతుల కల్పనతో పాటు తెలంగాణప్రభుత్వం అమలు చేస్తున్న రైతుభరోసా, మహాలక్ష్మి వంటి పథకాలపైశాసనసభలో సభ్యులు తమ అభిప్రాయాలను తెలిజేశారని తెలిపారు. కడపటి శాసనసభ సమావేశాలు అర్ధరాత్రి వరకు జరిగాయని తెలియజేసేందుకు తాను హర్షం వ్యక్తం చేస్తున్నానమన్నారు.
ప్రజా సమస్యలపై చర్చించేందుకు ఎంత సమయమైనా సభను సమావేశపరచడం శాసనసభ నిబద్ధతను సూచిస్తుందని పేర్కొన్నారు. కాన్ఫరెన్స్‌లో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ ముదిరాజ్, లేజిస్లేటివ్ సెక్రటరీ డాక్టర్ వీ నరసింహా చార్యులు పాల్గొన్నారు.