14-09-2025 01:42:54 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 13 (విజయ క్రాంతి): కాలేజీలు నడిపే పరిస్థితి లేదు. కనీసం టోకెన్లు జారీ చేసిన రూ.1200 కోట్లనైన విడుదల చేయాలని ప్రైవేట్ కాలేజీల యాజమాన్య సంఘాలు ప్రభుత్వాన్ని కోరా యి. అయితే, వేల కోట్లు బకాయిలు ఒకేసారి విడుదల చేసే పరిస్థితి ప్రస్తుతం లేదని, కావాలంటే ఇప్పుడు రూ.100 కోట్లు.. రూ.200 కోట్లను విడుదల చేస్తామని, ఖజానా ఖాళీగా ఉందని, కాలేజీల బంద్ విషయంలో పునరాలోచించాలని యాజమాన్య సంఘాల నేతలను ప్రభుత్వం కోరినా సంఘాలు ససేమిరా అన్నట్టు తెలిసింది.
ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలపై శనివారం ప్రభుత్వం యాజమాన్య సంఘాల నేతలతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఒకేసారి అన్ని కాలేజీలు నిరవధిక బంద్‌ను ఏ విధంగా ప్రకటిస్తాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క యాజమాన్య సంఘాల నేతలపై ఆగ్ర హం వ్యక్తం చేసినట్టు సమాచారం.
అనంత రం మంత్రి శ్రీధర్‌బాబు, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డితో భేటీ అయిన ప్రైవేట్ కాలేజీల యాజమాన్య సంఘాల నేతలు బకాయిలను వెంటనే విడుదల చేయాల్సిందేనని స్పష్టంచేశారు. దీనిపై సోమవారం కల్లా తమకు ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని అప్పుడే తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని.. ప్రభుత్వానికి యాజమాన్య సంఘాల నేతలు అల్టిమేటం జారీ చేసినట్టు సమాచారం.