21-09-2025 07:23:38 PM
హనుమకొండ (విజయక్రాంతి): గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ఊరి ఊరికో చెట్టు గుడి గుడికో జమ్మి జమ్మి చెట్టు కార్యక్రమాన్ని ఆదివారం రోజున హనుమకొండలోని పద్మాక్షి గుట్ట ఆలయ రహదారి వద్ద నిర్వహించారు. మొదట పద్మాక్షి గుట్ట మీద ఉన్న అమ్మవారికి పూజలు నిర్వహించారు. అనంతరం రెండు జమ్మి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రాన్ని పాడి పంటలతో సస్యశ్యామలం చేసిన ఘనత ఉద్యమ నేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు. తెలంగాణలో అడవుల శాతం పెంచేందుకు 10 ఏండ్లలో తెలంగాణకు హరితహారం పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి కోట్లాది మొక్కలు నాటారని గుర్తు చేశారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ పేరుతో లక్షలాది మొక్కలను నాటారని, ఈ కార్యక్రమ నిర్వాహకులు సంతోష్ ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారని కొనియాడారు.
తెలంగాణలో జమ్మి చెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉందని, కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర అధికారిక చెట్టుగా జమ్మి చెట్టును నిర్ణయించారని, నేడు ఈ పద్మాక్షి ఆలయ ఎదుట జమ్మి మొక్కలను నాటామని అన్నారు. తెలంగాణలో నేడు బతుకమ్మ సంబరాలు మొదలవుతున్నాయని, ఆడబిడ్డలు జరుపుకొనే ఈ పండగకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయాలని, సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగ కానుకలు అందించేందని, ఈ ప్రభుత్వం సైతం సకాలంలో ఆడబిడ్డలకు కానుకలు అందించి వారు సంతోషంతో పండుగ జరుపుకొనేలా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ బాధ్యులు గార్లపల్లి సతీష్, బీఆర్ఎస్ నాయకులు కోడెం సంపత్, వేల్పుల వేణు, గుండు సదానందం, పెరుకారి శ్రీధర్, గండ్రకోట రాకేష్ యాదవ్, మంద సృజన్ కుమార్, తక్కళ్లపల్లి వినీల్ రావు, సాయి, సన్నీ,వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.