calender_icon.png 7 July, 2025 | 12:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశ వ్యాప్త సమ్మెతో కార్మిక వర్గం ఐక్యతను చాటుదాం

06-07-2025 06:25:54 PM

పని గంటల పెంపు నిర్ణయాన్ని రాష్ట్ర వెనక్కు తీసుకోవాలి..

సమ్మెకు మద్దతుగా బైక్ ర్యాలీ..

మందమర్రి (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 9న జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన దేశ వ్యాప్త సమ్మెను విజయవంతం చేసి కార్మిక వర్గం ఐక్యతను చాటాలని సిఐటియు అనుబంధ కోల్ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ కార్యదర్శి అల్లి రాజేందర్(Secretary Alli Rajender) కోరారు. జూలై 9 దేశవ్యాప్త సమ్మెను సింగరేణిలో విజయవంతం చేయాలని కోరుతూ సింగరేణి కాలవ్స్ ఎంప్లాయిస్ యూనియన్ (CITU) బ్రాంచ్ అధ్యక్షులు సాంబారు వెంకటస్వామి ఆధ్వర్యంలో చేపట్టిన బైక్ ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. రామకృష్ణాపూర్ కార్యాలయం నుండి ప్రారంభమైన ర్యాలీ రామకృష్ణాపూర్ కార్మిక కాలనీల గుండా మందమర్రి మార్కెట్, కార్మిక కాలనీల నుండి యూనియన్ కార్యాలయం వరకు చేపట్టారు.

ఈ సందర్భంగా రాజేందర్, వెంకటస్వామిలు మాట్లాడుతూ... కార్పొరేట్లకు అనుకూలంగా, కార్మికులకు చెంప పెట్టులా ఉన్న నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే సవరించాలని కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలను అమలు చేయాలని, ప్రభుత్వ రంగ పరిశ్రమల ప్రైవేటీ కరణను నిలిపి వేయాలని వారు డిమాండ్ చేశారు. పని గంటల పెంపును వ్యతిరేకిస్తూ, కార్మికుల చివరి ఆయుధమైన సమ్మె హక్కును తీసివేస్తే ఊరుకునేది లేదని వారు హెచ్చరించారు. రైతులకు కనీసం మద్దతు ధరను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ కార్మిక కర్షకులందరూ కలిసి చేస్తున్న సమ్మెను సింగరేణి లో విజయవంతం చేయాలని వారు కోరారు.

బొగ్గు గనులు లేకపోతే కోల్ బెల్ట్ ప్రాంతం నిర్వీర్యం అవుతుందని పట్టణ వర్తక వ్యాపారులు సమ్మెపై ఆలోచించుకొని బందుకు మద్దతు తెలుపాలన్నారు. మరోవైపు పని గంటల పెంపును వ్యతిరేకిస్తు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతుండగా, బిజెపి ప్రభుత్వం తీర్పు బాటలోనే రాష్ట్రంలోని ప్రజా వ్యతిరేక విధానాలను కాంగ్రెస్ ప్రభుత్వం మేమేం తక్కువ కాదన్నట్లు 10 గంటలకు వరకు పనిచేయించు కోవచ్చంటు జీవో విడుదల చేయడం సిగ్గుచేటని వారు విమర్శించారు.

పని గంటల పెంపును ప్రభుత్వం వెనక్కు తీసుకోకుంటే రానున్న ఎన్నిక ల్లో భంగపాటు తప్పదని వారు స్పష్టం చేశారు. మరో వైపు కార్మిక సంఘాలన్నీ ఇచ్చిన సమ్మెను వ్యతిరేకిస్తున్న బిఎంఎస్ రెండు లేబర్ కోడులను స్వాగతిస్తున్నామని మరో రెండింటిని వ్యతిరేకిస్తున్నామని చెప్పడం విడ్డూరంగా ఉందని వారు మండిపడ్డారు.ఈ కార్యక్రమంలో బ్రాంచ్ ఉపాధ్యక్షులు రామగిరి రామస్వామి,  వడ్లకొండ ఐలయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు జోరుక వెంకటేష్, నాగవల్లి శ్రీధర్, నామని సురేష్, పసునూటి శ్రీకాంత్, లింగాల రమేష్, కవ్వ చైతన్య రెడ్డి, సత్యనారాయణ, మహమ్మద్ తాజుద్దీన్, సయ్యద్. అమీర్, శ్రీనివాస్, నవీన్, సురేష్ లు పాల్గొన్నారు.