20-10-2025 12:45:44 AM
ముగింపు ఉత్సవాలకు రానున్న 40 దేశాల ప్రతినిధులు
భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 19 (విజయక్రాంతి): ఖమ్మం కేంద్రంగా జరిగే భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) జాతీయ శాతాబ్ది ఉత్సవాల ముగింపు ఉత్సవాన్ని అట్ట హాసంగా జరుపుకుందామని, డిసెంబర్ 26న ఖమ్మం గుమ్మం ఎరుపెక్కాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు అన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యలు కే సారయ్య అధ్యక్షతన పాల్వంచ కేంద్రంగా జిల్లా కార్యవర్గం కౌన్సిల్ సమావేశం జరిగింది.
సమావేశానికి ముఖ్య అతిధిగా కూనంనేని హాజరైన మాట్లాడారు. శత వసంత ఉత్సవాలకు 40 దేశాలకు చెందిన ప్రతినిధులు తరలిరానున్నారని తెలిపారు. ఖమ్మం వేదికగా జరిగే ఉత్సవ ముగింపు సభ ఓ చారిత్రాత్మక ఘట్టంగా మిగిలిపోతుందని ఇందుకోసం ప్రతి కార్యకర్త నడుం బిగించాలని చెప్పారు. సిపిఐ పోరాటాలను ఉద్యమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, అన్ని వర్గాల ప్రజలకు సిపిఐ చరిత్రను వివరించాలని సూచిం చారు.
కమ్యూనిస్టుల పని అయిపోయింది అని అంటున్న వారి నోళ్లు మూతపడేలా ఉత్సాహపూరిత వాతావరణంలో ఈ వేడుక ఉండబోతుందన్నారు. అనంతరం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు భాగం హేమంతరావు మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కులాలు, మతాల పేరుతో ప్రజలను విడదీస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటుందని, ప్రశ్నించే వారిని జైల్లకు పంపుతూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని మండిపడ్డారు.
కమ్యూనిస్టు పార్టీలు అంతా ఏకమై ప్రజా సంటక పాలకుల చేతుల నుండి అధికారాన్ని చేజిక్కించు కునేందుకు పనిచేయాల్సిన అవసరం ఆసన్నమైందని చెప్పారు. శతవసంతాల ముగింపు సభ వేదికగా కమ్యూనిస్టు పార్టీ మరింత పురోగమన దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా జిల్లా రాజకీయ పరిస్థితులను వివరించి శత వసంత ఉత్సవాల జయప్రదంకోసం లక్ష్యాలను సభ్యులకు నిర్దేశించారు.
సిపిఐ నూరేళ్ల ముగింపు ఉత్సవం విశేషాన్ని గ్రామ గ్రామానికి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం, కల్లూరి వెంకటేశ్వరరావు, రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యులు మిర్యాల రంగయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు సరెడ్డి పుల్లారెడ్డి, మున్నా లక్ష్మీకుమారి, నరాటి ప్రసాద్, వై ఉదయ్ భాస్కర్, ఎస్ డి సలీం, సలిగంటి శ్రీనివాస్, రావులపల్లి రవికుమార్, చంద్ర నరేంద్రకుమార్, జి వీరస్వామి, శంకర్, వాసిరెడ్డి మురళి, కంచర్ల జమలయ్య, భూక్య దాస్రు, బంధం నాగయ్య, ఉప్పు శెట్టి రాహుల్ పాల్గొన్నారు.