14-05-2025 12:51:46 AM
ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి
చండూరు, మే 13 : బీజేపీ నాయకత్వంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక ప్రజా వ్యతిరేక విధానాలపై ఈ నెల 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు కార్మిక వర్గం రైతాంగం పెద్ద ఎత్తున సిద్ధం కావాలని ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి పిలుపునిచ్చారు.
మంగళవారం నాంపల్లి మండల కేంద్రం సిఐటియు కార్యాలయంలో ఈనెల 20న దేశవ్యాప్త సార్వత్రికసమ్మె గోడ పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాంపల్లి చద్రమౌళి మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గ హక్కులు కాలరాస్తుందని, వ్యవసాయ రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టిందని, ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసి పేదల పొట్టలు కొడుతుందని వారు విమర్శించారు.
ధరలు నిరుద్యోగం ఎన్నడూ లేనంతగా పెరిగి ప్రజల కొనుగోలు శక్తి తీవ్రంగా పడిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మోడీ ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని విమర్శించారు. దేశంలో 77 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ప్రజల రెక్కల కష్టంతో పెరిగి పెద్దవైన ప్రభుత్వ రంగ సంస్థలని, గనులు భూములు ఓడరేవులు సహజ వనరులన్నిటిని స్వదేశీ విదేశీ బడా పెట్టుబడుదారులకు కారు చౌకగా అమ్ముతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
మతం పేరుతో ప్రజల మధ్య విద్వేష రాజకీయాలు చేస్తూ సమస్యలను పక్కదోవ పట్టిస్తూ కాలం గడుపుతుందని ఎద్దేవ చేశారు. ఈ విధానాలను ప్రతిఘటించడం కోసమే కార్మిక వర్గం రైతాంగం 145 కోట్ల ప్రజల ప్రయోజనాల కోసం జరుగుతున్న ఈ పోరాటంలో రైతాంగం కార్మిక వర్గం ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు ఆశ వర్కర్స్ యూనియన్ నాయకులు కోరే లలిత, ఏదుల సునీత, జిపి కార్మికులు గాదెపాక మరియమ్మ, ఎంకమ్మ, ఎల్లయ్య, ఈరమ్మ, తేజ, సులోచన రాములమ్మ చంద్రమ్మ తదితరులు పాల్గొన్నారు.