calender_icon.png 12 July, 2025 | 2:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పగటికలలు మానేద్దాం!

18-05-2025 12:00:00 AM

అందరిదీ ఒకే జీవితం. కానీ అందరి జీవితం ఒకేలా ఉండదు. అంచనాలకు, ఊహలకు తగినట్టు వాస్తవాలు ఉండటం లేదని బాధపడేవాళ్లే చాలామంది. అందుకే అస్తమానం గాలిమేడలు కడుతూ, ఊహా ప్రపంచంలో బతికేస్తుంటారు. ఊహలు కొంతవరకు బాగుంటాయి కానీ.. అదే ప్రపంచంగా బతకడం ఒకరకంగా అనారోగ్యమే అంటున్నారు నిపుణులు. ఇలాంటి వారిలో వాస్తవాన్ని అంగీకరించే శక్తి ఉండదు. కాబట్టి పగటి కలలకు బ్రేక్ వేయాలంటే కింది చిట్కాలను పాటిస్తే సరిపోతుంది. వాటిలో ముఖ్యమైనవి..

మనిషి ఇక్కడ, మనసు ఎక్కడోలా గడిపేస్తుంటారు కొంతమంది. ఎక్కడ ఉన్నాం? ఏం చేస్తున్నాం? అనే విషయాల మీద పూర్తి దృష్టి పెట్టాలని అంటున్నారు మానసిక నిపుణులు. దీనికి బ్రీతింగ్ ఎక్సర్‌సైజులు బాగా ఉపయోగపడతాయి. అలాగే ఏది చేసినా కూడా ఏదో మొక్కుబడిగా కాకుండా పూర్తిగా అందులో మమేకమైన చేయాలి. భోంచేస్తున్నా, నీళ్లు తాగుతున్నా కూడా ఆ పనిపైనే ధ్యాస పెట్టాలి.

ధ్యానం..

ఎప్పుడూ ఏవో ఆలోచనలతో గడిపితే మానసికంగానే కాదు శారీరకంగా కూడా అలసిపోతాం. తెలియని ఒత్తిడికి లోనవుతాం. దీని నుంచి బయటపడటానికి ధ్యానానికి మించిన మార్గం లేదు. నిరంతర ఆలోచనలకు బ్రేక్ ఇచ్చేందుకు ధ్యానం ఉపయోగపడుతుంది. అటు, ఇటు వెళ్లకుండా మెదడును, మనసును నియంత్రించే శక్తి అలవడుతుంది. ప్రాణాయామం, ధ్యానం ద్వారా పగటికలలకు చెక్ పెట్టవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. 

ప్రాధాన్యతలు..

జీవితంలో ఏం సాధించాలి? అన్న దానిపై చాలామందికి స్పష్టత ఉండదు. ఆ క్షణంలో ఏది తోస్తే ఆ వైపునకు ఆలోచనలను మళ్లిస్తారు. ఒకరకంగా ఇది సులువు కూడా. అలాంటప్పుడు పగటికలల్లో మునిగిపోతారు. అందుకే కెరీర్ పరంగానే కాదు.. జీవితంలో మన లక్ష్యాలు, ప్రాధాన్యతలు ఏమిటన్నది స్పష్టంగా నిర్ధారించుకోవాలి. ఇలా చేస్తే నెమ్మది నెమ్మదిగా పగటి కలలు తగ్గిపోతాయి.