16-05-2025 12:43:59 AM
మహబూబాబాద్, మే 15 (విజయక్రాం తి): తెలంగాణ రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా గత ఏడాది సెప్టెంబర్ లో కురిసిన కుంభవృష్టితో మహబూబాబాద్ జిల్లాలో అనేక చోట్ల రహదారుల పై ఉన్న వంతెనలు దెబ్బతిన్నాయి. కొన్నిచోట్ల రోడ్లు, వంతెనలు పూర్తిగా వరదకు కొట్టుకుపోగా, మరి కొన్ని చోట్ల పాక్షికంగా దెబ్బతిన్నాయి. దీనితో అప్పట్లో పది రోజులపాటు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.
అనంతరం దెబ్బతిన్న రోడ్లు, వంతెనల వద్ద తాత్కాలికంగా అప్రోచ్ రోడ్లు వేసి రాకపోకలను పునరుద్ధరించారు. పలుచోట్ల ఆర్ అండ్ బి, ఇంకొన్ని చోట్ల పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ తాత్కాలిక మరమ్మత్తులతో రాకపోకలు పునరుద్ధరించినప్పటికీ పూర్తిస్థాయిలో మరమ్మత్తు పనులు ఇప్పటివరకు నిర్వహించలేదు. కొన్నిచోట్ల దెబ్బతిన్న బ్రిడ్జిలను పూర్తిగా తొలగించాల్సి ఉండగా, మరి కొన్నిచోట్ల కొంతమేర తొలగించి కొత్తగా వంతెనలను నిర్మించాల్సి ఉంది.
అయితే మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ శాఖల పరిధిలోని చిన్న, మధ్య, భారీ వంతెనలు దెబ్బతినగా వాటి మరమ్మత్తులకు అవసరమైన అంచనాలను రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు. అయితే ఇప్పటివరకు తాత్కాలిక పనులు మాత్రమే నిర్వహించి, పూర్తిస్థాయి మరమ్మతు పనులను చేపట్టకుండా వదిలేశారు.
వేసవికాలం కావడంతో జిల్లాలో పలు ప్రధాన రహదారుల్లో దెబ్బతిన్న వంతెనల వద్ద తాత్కాలిక పనులతో ఇంతకాలం పెద్దగా ఆటంకం లేకుండా రాకపోకలు నడిచాయి. అయితే వచ్చే వానాకాలంలో వర్షాలు భారీగా కురిస్తే తాత్కాలికంగా వేసిన అప్రోచ్ రోడ్లు దెబ్బతినే అవకాశం ఉంది. దీంతో వివిధ మార్గాల్లో రాకపోకలకు ఆటంకం కలిగే అవకాశాలున్నాయి.
ప్రధానంగా మహబూబాబాద్ ఖమ్మం జిల్లాల మధ్య ములకలపల్లి వద్ద ఏరుపై కొత్తగా నిర్మించిన హై లెవెల్ బ్రిడ్జి కొంతమేర కొట్టుకుపోయింది. దీనితో పక్కనే ఉన్న పాత లోలెవెల్ బ్రిడ్జి పై నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. ఇక్కడ దెబ్బతిన్న బ్రిడ్జికి కొత్తగా స్లాబులు వేయకపోవడంతో వర్షాకాలంలో ఏరు పొంగి ప్రవహిస్తే లోలెవెల్ బ్రిడ్జి పైనుంచి వరద నీరు ప్రవహించడం తద్యమని, దీని వల్ల రాకపోకలు నిలిచిపోక తప్పదని చెబుతున్నారు.
ఇక ఇదే విధంగా మహబూబాబాద్ మరిపెడ జాతీయ రహదారిపై హై లెవెల్ బ్రిడ్జికి ఇరువైపులా అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోగా, శాశ్వత పనులు చేపట్టకుండా గ్రావెల్ , కంకర పోసి తాత్కాలిక రోడ్డు వేసి రాకపోకలు సాగిస్తున్నారు. మళ్లీ భారీ వర్షం కురిస్తే అప్రోచ్ రోడ్డు దెబ్బతిని రాకపోకలు స్తంభించే పరిస్థితి నెలకొంది. ఇదేవిధంగా మహబూబాబాద్ నరసింహుల పేట మార్గంలో చిన్న గూడూరు వద్ద ఏరు పై బ్రిడ్జి వద్ద కూడా ఇలాంటి పరిస్థితే నెలకొంది.
ఇక భూపతి పేట నుంచి కొత్తగూడా మార్గంలో చిన్న ఎల్లాపురం వద్ద బ్రిడ్జి నిర్మించి శాశ్వత ప్రాతిపదికన అప్రోచ్ రోడ్డు నిర్మించకుండా కేవలం మొరం పోసి వదిలేశారు. దీనితో రాకపోకలు సాగించేందుకు వాహనదారులు అనేక అవస్థలు పడుతున్నారు.
ఇనుగుర్తి నుంచి అన్నారం మార్గంలో ఇనుగుర్తి వద్ద రోడ్డు దెబ్బతింది. అలాగే సీతారాంపురం మార్గంలో లోలెవల్ బ్రిడ్జి వద్ద రోడ్డు దెబ్బతింది. ఇలా జిల్లా వ్యాప్తంగా ప్రధాన రహదారుల వెంట వాగులపై ఉన్న దెబ్బతిన్న వంతెనలకు శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టి, వాహనాల రాకపోకలకు అంతరయం కలగకుండా చూడాల్సిన అవసరం ఉంది.
తాత్కాలిక పనుల బిల్లులే రాలే!
మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా గత ఏడాది సెప్టెంబర్ లో కురిసిన అతి భారీ వర్షాలకు 50 చోట్ల ఆర్ అండ్ బి పరిధిలో రోడ్లు, బ్రిడ్జిలు దెబ్బతిన్నాయి. వాటికి సుమారు 94 లక్షల రూపాయలతో తాత్కాలికంగా మరమ్మతులు నిర్వహించారు. అయితే పనులు నిర్వహించి ఆరు నెలలు దాటినా ప్రభుత్వం ఒక్క పైసా బిల్లు చెల్లించలేదని గుత్తేదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడం వల్ల కొత్త పనులను చేపట్టడానికి ముందుకు రావడం లేదు.
శాశ్వత పనుల కోసం ప్రతిపాదనలు పంపాం
మహబూబాబాద్ జిల్లాలో గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు డోర్నకల్, మరిపెడ, చిన్న గూడూరు, కురవి మండలాల్లో దెబ్బతిన్న వంతెనలు, రోడ్ల మరమ్మత్తుల కోసం శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టడానికి 200 కోట్ల రూపాయల అంచనా తో పనులను ప్రతిపాదించి ప్రభుత్వానికి నివేదిక పంపించాం. ప్రభుత్వం నుంచి పరిపాలన పరమైన అనుమతి, నిధులు మంజూరు కాగానే పనుల నిర్వహణకు టెండర్లు పిలిచి, పనులు చేపట్టడానికి చర్యలు తీసుకుంటాం.
భీమ్లా, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఆర్ అండ్ బి), మహబూబాబాద్