calender_icon.png 12 August, 2025 | 4:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాస్వామ్యంలో బ్యూరోక్రసీది కీలక పాత్ర

12-08-2025 12:31:25 AM

  1. సివిల్స్ అభ్యర్థులకు అన్ని విధాలుగా అండగా ఉంటాం..
  2. మెయిన్స్‌కు ఎంపికైన వారికే కాదు.. ఇంటర్వ్యూకు ఎంపికైన వారికీ ఆర్థిక సాయం
  3. డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క
  4. మెయిన్స్‌కు ఎంపికైన 180 మంది అభ్యర్థులకు చెక్కుల అందజేత 

హైదరాబాద్, ఆగస్టు 11 (విజయక్రాంతి): ప్రజాస్వామ్యంలో బ్యూరోక్రసీదే కీలక పాత్ర అని, ప్రజలకు సంక్షేమ పథకాలు చేరవేయడంలో సివిల్ సర్వీసెస్ అధికారులు ముఖ్యభూమిక పోషిస్తారని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క  పేర్కొన్నారు. హైదరాబాద్ ప్రజాభవన్‌లో సోమవారం ఆయన మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌తో కలిసి సింగరేణి ఆధ్వర్యంలో సివిల్స్ మెయిన్స్‌కు ఎంపికైన 180 మందికి రూ.లక్ష చొప్పున జారీ అయిన చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు.

యువతీ యువకులు ఎక్కువ మంది సివిల్స్ సాధించాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. వ్యవస్థలో మానవ వనరులు ముఖ్యమైనవని, అవే బలమైన పెట్టబడులని అభివర్ణించారు. మానవ వనరులను సానబడితే, అవి వజ్రాలుగా మారతాయని, తద్వారా ప్రజలకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. సివిల్స్ సాధించేందుకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు అన్ని విధాలుగా సహకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని భరోసానిచ్చారు.

ఒక్క మెయిన్స్‌కే కాదని, ఇంటర్వ్యూకి ఎంపికైన అభ్యర్థులకు కూడా లక్ష ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు. మొదటి సంవత్సరం 148 మందికి ఆర్థిక సాయం అందించగా, వారిలో పదిమంది సివిల్ సర్వీసెస్‌కి ఎంపికయ్యారని గుర్తుచేశారు. సివిల్ సర్వీసెస్ అధికారుల్లో ఎస్‌ఆర్ శంకరన్, పార్థసారథి, మాధవరావు వంటి కొద్దిమంది పేర్లు మాత్రమే జనం గుండెల్లో నిలిచిపోయాయని కొనియాడారు.

నిబద్ధతతో ప్రజలకు సేవలందిస్తే ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారనడానికి అలాంటి ఐఏఎస్‌లే నిదర్శనమని శ్లాఘించారు. అధికారుల్లో చిత్తశుద్ధి లోపిస్తే ప్రభుత్వ లక్ష్యాలు కూడా ఎంత గొప్పగా ఉండవని అభిప్రాయపడ్డారు. ఎస్‌ఆర్ శంకరన్ సాంఘిక సంక్షేమ శాఖలో సెక్రటరీగా ఉన్నప్పుడు చేపట్టిన కార్యక్రమాలు ప్రజల జీవన స్థితిగతులు మార్చడానికి ఉపయోగపడ్డాయని గుర్తుచేసుకున్నారు.

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రప్రభుత్వం విద్యాభివృద్ధి కోసం కృషి చేస్తున్నదని, దీనిలో భాగంగానే స్కిల్ వర్సిటీ ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. రాష్ట్రప్రభుత్వం ‘రాజీవ్ సివిల్స్ అభయ హస్తం’ పథకాన్ని గొప్ప ఆశయంతో అమలు చేస్తున్నదని, సివిల్స్ అభ్యర్థులు మున్ముందు అధికారులైతే.. అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

అనంతరం డిప్యూటీ సీఎం, మంత్రులు 2024లో రాష్ట్రం నుంచి సివిల్స్‌కు ఎంపికైన 30 మందికి జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, గండ్ర సత్యనారాయణ, మక్కాన్‌సింగ్ రాజ్ ఠాకూర్, ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, సింగరేణి సీఎండీ ఎన్ బలరాం పాల్గొన్నారు.