calender_icon.png 19 May, 2025 | 7:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేయి వేణువుల నాదం మోగేలా..

19-05-2025 01:03:11 AM

రాజేంద్రప్రసాద్, అర్చన కాంబినేషన్‌లో రూపేశ్, ఆకాంక్షసింగ్ హీరోహీరోయిన్లుగా పవన్ ప్రభ దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై రూపేశ్ నిర్మించిన చిత్రం ‘షష్టిపూర్తి’. ఈ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి టీమ్ ఓ కొత్త పాటను ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ చేతుల మీదుగా విడుదల చేయించారు.

ఇప్పటివరకూ మూడు రొమాంటిక్ పాటలు విడుదల చేసిన చిత్రబృందం ఇప్పుడు టైటిల్ జస్టిఫికేషన్ చేస్తూ షష్టిపూర్తి వేడుక నేపథ్యంలో పాటను విడుదల చేసింది. ‘వేయి వేణువుల నాదం.. మోగే హాయిహాయి హృదయాన.. ప్రేమ మంత్రముల గానం సాగే ఈ ముహూర్త సమయాన.. సరాదలే సరిగమలై పలికిన శుభవేళ.. అరవైలో ఇరవైలా విరిసిన వరమాల..’ అంటూ సాగే ఈ గీతాన్ని చైతన్యప్రసాద్ రాశారు.

ఇళయరాజా సంగీత సారథ్యంలో కార్తీక్, విభావరి ఆప్టే జోషి పాడారు. ఈ పాట గురించి దర్శకుడు పవన్ ప్రభ మాట్లాడుతూ.. “ఇకపై ఎవరు షష్టిపూర్తి జరుపుకున్నా ఈ పాటను ప్లే చేసి తీరాల్సిందే. ఇళయరాజా స్వరాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముంటుంది? ఈ పాట రికార్డింగ్‌ను ప్రత్యక్షంగా వీక్షించి పులకించిపోయాను. చాలా కాలం గుర్తుండిపోయే పాట ఇది” అన్నారు.