20-11-2025 12:18:43 AM
ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
కల్వకుర్తి నవంబర్ 19: కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు లేక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితిపై ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్కు కూతవీడు దూరంలో మూడు జాతీయ రహదారులు ఆనుకుని ఉన్న కల్వకుర్తి నియోజకవర్గంలో ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందన్నారు. గత పాలకులు ఆసుపత్రి అభివృద్ధిని పట్టించుకోక పోవడంతో రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన పలువురు మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచి పెట్టాల్సి వస్తోందన్నారు.
ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ముఖ్య మంత్రితో చర్చించి కల్వకుర్తిలో 150 పడకల కొత్త ఆసుపత్రి నిర్మాణానికి నిధులు మంజూరు చేయించామని, ఇప్పటికే పనులు ప్రారంభించినట్లు తెలిపారు. అభివృద్ధి చేస్తున్నా విమర్శించే నాయకులు నాడు అధికారంలో ఉండి కల్వకుర్తికి ఆసుపత్రి ఎందుకు మంజూరు చేయించలేదని ప్రశ్నించారు. కల్వకుర్తి అభివృద్ధి కోసం ప్రభుత్వం అన్ని విధాలుగా ముందుంటుందని, ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు వేగవంతం చేస్తున్నామని స్పష్టం చేశారు.