calender_icon.png 25 July, 2025 | 7:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ర్యాంకుల రేసులో ప్రాణాలు బలి

06-12-2024 12:50:56 AM

నారాయణ, శ్రీచైతన్యతోపాటు పలు కాలేజీల్లో వరుసగా బలవన్మరణాలు

  1. రోజుకు 15 గంటలు తరగతులు, స్టడీ అవర్స్
  2. డైలీ, వీకెండ్, నెలవారీ పరీక్షల పేరిట ఒత్తిడి
  3. తల్లిదండ్రులకు చెప్పుకోలేక.. ఒత్తిడి భరించలేక తనువు చాలిస్తున్న విద్యార్థులు

నిజామాబాద్ జిల్లా బోర్గం మండలం చింతాడుకు చెందిన ప్రజ్ఞ (18) ప్రగతినగర్ సింహపురి కాలనీలోని  ఓ కార్పొరేట్ కాలేజీలో ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. చదువు ఒత్తిడికి తాళలేక ఈనెల 1న హాస్టల్ గదిలో ఉరేసుకుని తనువు చాలించింది.’

యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం పెద్దపలుగు తండాకు చెందిన బానోత్ తనుష్ నాయక్ (16) 

అన్నోజిగూడలోని నారాయణ కాలేజీలో ఎంపీసీ ఫస్టియర్ చదువుతున్నాడు. ఈనెల 2న సాయంత్రం

బాత్‌రూంలో బెడ్‌షీట్‌తో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

అక్టోబర్ 21న బాచుపల్లి నారాయణ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సర విద్యార్థిని అనూష

ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది.

* మదీనగూడలోని శ్రీచైతన్య కాలేజీలో సెకండియర్ చదువుతున్న ఓ విద్యార్థినిని ఆ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ స్నాప్‌చాట్‌లో మెసేజ్‌లు పెట్టి వేధించిన ఘటన ఈనెల 2న చోటుచేసుకున్నది. ఇలా నారాయణ, శ్రీచైతన్య కళాశాలల్లో బలవన్మరణాలు చోటుచేసుకుంటున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి కదలిక లేదని విద్యార్థి సంఘాలు విమర్శిస్తున్నాయి.

హైదరాబాద్, డిసెంబర్ 4 (విజయక్రాంతి): కంటి నిద్ర లేదు.. ఆహ్లాదం లేదు.. ఆనందం లేదు.. కార్పొరేట్ కాలేజీల్లో ర్యాంకుల రేసు నడుస్తున్నది. విద్యార్థి ఆ రేసులో ఎంత పరిగెడితే అంత ఫాయిదా.. అన్నట్లు యాజమాన్యాలు వారిపై ఒత్తిడికి గురిచేస్తున్నాయి.

సాధారణంగా విద్య జ్ఞానానికి, మేధోవికాసానికి బాటలు వేయాల్సి ఉండగా, యాజమాన్యాలు మాత్రం యాం త్రికమైన చదువులకు బాటలు వేస్తున్నాయి. మంచి ర్యాంకులు తెచ్చుకోకపోతే భవిష్యత్తులో మంచి కెరీర్ ఉండదనే భ్రమల్లో విద్యార్థులను ఉంచుతున్నాయి.

తమ పిల్లలు బాగా చదవాలని, ఉన్నత శిఖరాలు అధిరోహించాలని తల్లిదండ్రులకు ఆశ పడుతు న్నారే కానీ, విద్యాసంస్థల్లో పిల్లలు ఎంత ఒత్తిడికి గురవుతున్నారనే విషయాన్ని పట్టించుకోవడం లేదు.

అందరూ ఉన్నా ఒంటరై..

పదోతరగతి వరకు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య మెలుగుతూ చదువుకున్న పిల్లలు ఇంటర్మీడియట్ కు నగరాలకు వస్తున్నారు. అక్కడ అందరూ ఉన్నా, ఎవరూ లేని ఒంటరి బతుకు బతుకుతుకున్నారు. యాజమాన్యాలు అకడమిక్ చదువులతోపాటు విద్యార్థులకు అదనంగా జేఈఈ, నీట్, ఎప్‌సెట్ వంటి కోర్సులనూ అంటగడుతున్నాయి.

కసాయోళ్లు బందెల దొడ్డిలో పశువులను వదిలేసినట్లు యాజమాన్యాలు తరగతి గదుల్లో విద్యార్థులను మగ్గేలా చేస్తున్నారు. రోజుకు 15 నుంచి 16 గంటల వరకు తరగతులు, స్టడీ అవర్సే సరిపోతున్నాయి. ఇవే ఒత్తిడంటే మళ్లీ స్టడీ హవర్స్, డైలీ టెస్టులు, వీక్లీ టెస్టులనే పరీక్షల ఒత్తిడి కూడా పెరుగుతున్నది. ఆ పరీక్షల్లో ఎవరైనా మంచి మార్కులు తెచ్చుకోకుంటే, యాజమాన్యాలు తల్లిదండ్రులకు కాల్ చేసి చెప్తున్నాయి.

‘మీ కుమార్తె లేదా కుమారుడు బాగా చదవడం లేదు’ అని చిన్నబుచ్చుకునేలా చేస్తున్నాయి. తరగతి గదిలో తోటి విద్యార్థుల ముందు అవమానాలకు గురిచేస్తున్నాయి. ఒక దశాబ్దం క్రితం ఇంటర్ వార్షిక పరీక్షల్లో ఫెయిల్ అయ్యానని, మార్కులు తక్కువ వచ్చాయని ఆత్మహత్యలు ఉండేవి. కానీ, ఇప్పుడు అకడమిక్ ఇయర్ మధ్యలోనే విద్యార్థులు తనువులు చాలిస్తున్నారు.

యాజమాన్యాలు కాలేజీల్లో కనీసం కౌన్సిలర్లను నియమిస్తే బాగుంటుంది. కానీ, ఆ విషయాన్నే సంస్థలు పట్టించుకోవడం లేదు. తల్లిదండ్రుల ముక్కుపిండి సంస్థలు ఒక్కో విద్యార్థికి ఏడాదికి రూ.2.5 లక్షల నుంచి 2.80 లక్షల వరకు ఫీజు వసూలు చేస్తున్నాయి. ఫీజు కాక మళ్లీ ధోబీ ఫీజు అదనం.

అనుమతుల్లేకుండా తరగతులు..

హాస్టళ్లలోని గదుల్లో యాజమాన్యాలు పరిమితికి మించి విద్యార్థులను ఉంచుతున్నాయి. ఆ తరగతుల్లో కనీసం సరైనా వెంటిలేషన్ కూడా ఉండదు. దీంతో కొందరు శ్వాసకోశ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. 2024-25లో 300 పైగా ఇంటర్ కాలేజీలకు సరైన అనుమతులు లేవని తెలిసింది. వాటిని తనిఖీ చేయాల్సిన అధికారులు కంటి తుడుపు చర్యలు తప్ప, కఠిన చర్యలు తీసుకోవడంలేదనే విమర్శలు ఉన్నాయి.

మిక్స్‌డ్ ఆక్యుపెన్సీ విధానంలో 300కు పైగా కాలేజీలకు అనుమతులిచ్చే విషయాన్ని అధికారులు నానుస్తూనే ఉన్నారు. మియాపూర్‌లోని ఓ ప్రముఖ కాలేజీలోని బాత్రూం గోడలపై కొందరు విద్యార్థులు ‘ఫీజు కట్టలేదని మమ్మల్ని వేధిస్తున్నారు’ అని రాయడం చర్చనీయాంశమైంది. వేధింపులు, ఒత్తిడి కారనంగా గడిచిన నెల రోజుల్లో 10 మందికిపైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.

స్పందించిన ఇంటర్‌బోర్డు

ప్రైవేట్ కాలేజీల్లో చోటు చేసుకుంటున్న విద్యార్థుల బలవన్మ రణాలపై ఇంటర్ బోర్డు స్పందించింది. కాలేజీల్లో ఒక మహిళ, ఒక పురుష అధ్యాపకులను కౌన్సిలర్లుగా నియమించాలని ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులెవరైనా మానసిక ఒత్తిడికి గురైతే వారికి కౌన్సిలింగ్ నిర్వహించాలని సూచించింది. విద్యార్థులు టెలీమానస్ టోల్ ఫ్రీకి కాల్ చేసి సైకాలజిస్టుల సేవలు పొందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలను విద్యాసంస్థల యాజమాన్యాలు పట్టించుకోవడం లేదని విద్యార్థి సంఘాలు తెలుపుతున్నాయి.

వేధింపులతోనే ఆత్మహత్యలు 

కార్పొరేట్ ఇంటర్ జూనియర్ కాలేజీల యాజమాన్యాలు, అధ్యాపకుల వేధింపులతోనే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. విద్యార్థ్థు లను తరగతులు, స్టడీ అవర్స్ పేరిట రోజుకు 15 నుంచి 16 గంటల పాటు వేధిస్తున్నారు. మార్కులు, ర్యాంకుల వేటలో విద్యార్థులు ఒడిపోయినట్లు భావించి తనువు చాలిస్తున్నారు. ఇంటర్ బోర్డు అధికారులు కళాశాలలు, హాస్టళ్లను తనిఖీ చేసే పరిస్థితి లేదు. బోర్డు అండదండతోనే కాలేజీ యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. 

- కసిరెడ్డి మణికంఠరెడ్డి, 

ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు