06-12-2024 12:46:11 AM
మెదక్, డిసెంబర్ 5 (విజయక్రాంతి): అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలై ఈ నెల 3కు సరిగ్గా ఏడాది గడిచింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకున్నది. తర్వాత అప్పటివరకు బీఆర్‌ఎస్‌కు ఆయువు పట్టుగా ఉన్న ఉమ్మడి మెదక్ జిల్లాలో కొంత పట్టుకోల్పోవాల్సి వచ్చింది.
మొత్తం పది అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీ కేవలం మూడు స్థానాలను మాత్రమే దక్కించుకున్నది. బీఆర్‌ఎస్ మాత్రం ఏడు స్థానాలను పదిలపరుకున్నది. పటాన్‌చెరు నుంచి బీఆర్‌ఎస్ బీఫారంతో ఎమ్మెల్యేతో గెలిచిన మహిపాల్‌రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో కాంగ్రెస్ బలం ఒకింత పెరిగింది.
వాస్తవానికి ఎన్నికల్లో కాంగ్రెస్ ఉమ్మడి జిల్లాలో పెద్దగా ప్రాతినిధ్యం దక్కలేదు. తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లోనూ రెండు స్థానాల్లో కాంగ్రెస్ ఒక స్థానాన్ని మాత్రమే గెలుచుకోగలిగింది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనైనా సత్తా చాటేందుకు అధికార పార్టీ ప్రణాళికలు రూపొందిస్తున్నది. అవి ఎంతవరకు సఫలీకృతం అవుతాయో వేచి చూడాల్సిందే.
అభివృద్ధికి విఘాతం..
అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపులో రాష్ట్రప్రభుత్వం పక్షపాత వైఖరి ప్రదర్శిస్తున్నదని ఈ ప్రాంత ఎమ్మెల్యేలు అధికార పార్టీపై ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలతో పోలిస్తే ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని నియోజకవర్గాలకు నిధుల కేటాయింపు అంతంత మాత్రంగానే ఉందన్న విమర్శలు ఉన్నాయి.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలమైందంటూ గులాబీ శ్రేణులు దుమ్మెత్తి పోస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకుల మధ్య అభివృద్ధి విషయంలో వాదోపవాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీనికి తోడు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ప్రొటోకాల్ రగడ రచ్చకెక్కుతున్నది.
ఊహించని సమీకరణాలు
మెదక్ జిల్లా పరిధిలోని రెండు నియోజకవర్గాల నుంచి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మెదక్‌లో బీఆర్‌ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్‌రావు విజయం సాధించారు. ఈ స్థానంలో కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించిన తిరుపతిరెడ్డి తన అనుచరులతో ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్‌లో చేరారు.
నర్సాపూర్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డికి ఈసారి టికెట్ దక్కలేదు. మాజీ మంత్రి సునీతారెడ్డికి టికెట్ దక్కించుకుని, ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో బీఆర్‌ఎస్‌పై అలకబూనిన మదన్‌రెడ్డి లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ విధంగా జిల్లా రాజకీయాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. అంతేగాకుండా అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌ని వీడిన నేతలు అధికార పార్టీలో చేరడం గమనార్హం.
పదవుల పరంగా నిరాశే
ఏడాది కాలంలో ఎంతోమంది కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. కానీ, రాష్ట్రస్థాయిలో నామినేటెడ్ పదవుల్లో జిల్లా ముఖ్య నాయకులెవరికీ అవకాశం దక్కలేదు. ఇటీవల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవులు మాత్రమే భర్తీ అయ్యాయి.
ఇతర నామినేటెడ్ పోస్టులపై ఇప్పటివరకు అతీ గతీ లేదు. ఈ నేపథ్యంలో పదవులపై ఆశలు పెట్టుకున్న నేతలకు నిరాశే ఎదురైంది. జిల్లాలో ప్రతికూల ఫలితాల తర్వాతనైనా కాంగ్రెస్ అధిష్ఠానం అప్రమత్తం కాలేదు. దీంతో కాంగ్రెస్ శ్రేణుల ఒకింత నిరుత్సాహంలో ఉన్నాయనేది వాస్తవం.