25-09-2025 04:58:32 PM
ఊపిరి బిగపట్టి చూస్తున్న ఆశావాహులు
వలిగొండ,(విజయక్రాంతి): ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించేందుకు సిద్ధమవుతుండడంతో రిజర్వేషన్ల ప్రక్రియ ముగిసినట్లు తెలుస్తుండడంతో రిజర్వేషన్లు ఉత్కంఠత రేపుతున్నాయి. రిజర్వేషన్లు బయటికి తెలియనప్పటికీ గ్రామాలలో ఫలానా రిజర్వేషన్ వచ్చిందని, రాబోతుందని రచ్చబండల వద్ద, టీ దుకాణాల వద్ద, టిఫిన్ సెంటర్ల వద్ద చర్చలు జరుగుతుండడంతో ఎన్నికలలో పోటీ చేయాలనుకునే ఆశావహులు మాత్రం ప్రభుత్వం ప్రకటించే రిజర్వేషన్ల కోసం ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. నేడు, రేపు అంటూ ఉత్కంఠతో కొనసాగుతున్న రిజర్వేషన్లు ప్రక్రియ ఆశావాహులు ఎదురు చూస్తుండగా ఓటర్లు మాత్రం రిజర్వేషన్ నీకే వస్తుందని ఆశావాహులకు తెలియజేస్తూ ఆశలు రేకెత్తిస్తున్నారు. అయితే ఆశావాహులు మాత్రం ప్రభుత్వం గత సంవత్సరం కాలంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ఊరిస్తుండడంతో ఇప్పటికే ఖర్చులు తడిసి మోపడయ్యాయని ఎన్నికలు మరింత ముందుకు వెళ్ళినట్లయితే తమకు తలకు మించిన భారమవుతుందని లోలోన అంతర్మాదనం చెందుతున్నారు.