06-12-2025 12:00:00 AM
- గ్రామాల్లో విందులతో ముమ్మర ప్రచారం
గజ్వేల్, డిసెంబర్ 5: గజ్వేల్ నియోజకవర్గ వ్యాప్తంగా కొనసాగుతున్న సర్పంచ్ ఎన్నికల ప్రచారాన్ని అభ్యర్థులు జోరుగా కొనసాగిస్తున్నారు. మొదటి విడతలో భాగంగా గజ్వేల్, వర్గల్, ములుగు, జగదేవపూర్, మర్కుక్ మండలాల్లోని ఆయా గ్రామాలలో సర్పంచ్ అభ్యర్థులు ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. డమ్మీ బ్యాలెట్ పేపర్లను పంపిణీ చేస్తూ తమ గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు.
ఉదయం ప్రచారం ఎన్నికల నియమావళికి అనుగుణంగానే కొనసాగుతున్నా, సాయంత్రం నుండి ఆయా సర్పంచ్ అభ్యర్థులు గెలుపు కోసం పడరాని పాట్లు పడుతున్నారు. మద్య మాంసాలతో విందులు ఏర్పాటు చేయడంతో పాటు, కుల సంఘాలకు అవసరమైన సహకారం అందించేందుకు హామీలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే పలు గ్రామాలలో ఏకగ్రీవంగా సర్పంచ్ ను ఎన్నుకున్న గ్రామాలలో గ్రామస్తులకు భారీ మొత్తంలో హామీలు ఇచ్చారు.
కాగా ఏకగ్రీవ గ్రామాలలో ఎలాంటి విందులు కొనసాగకపోవడం గమనార్హం. ఎక్కువ శాతం గ్రామాలలో బి ఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మధ్య పోటాపోటీ వాతావరణం నెలకొనగా, కొన్ని గ్రామాల్లోనే బిజెపి అభ్యర్థులు గట్టి పోటీ ఇస్తున్నారు. మరి కొన్ని గ్రామాలలో టిఆర్‌ఎస్ పార్టీ నుండి ఎక్కువ మంది పోటీ చేస్తున్నారు. ఏది ఏమైనా అభ్యర్థుల ప్రచారం, సర్పంచ్ ఎన్నికల కోలాహలంతో ప్రజలకు మద్యం విందులతో ప్రతిరోజు పండగలాగే గడిచిపోతుంది.