calender_icon.png 16 July, 2025 | 11:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘దారి తెలిసిన మేఘం’ నిండా మానవీయత

14-07-2025 12:00:00 AM

బద్రి నర్సన్ :

సాధారణంగా కథల్లో జీవితాలే ఉం టాయి. అవి, వాటి బలమంతా రచయిత పరిశీలన, పరిశోధన, అభివ్యక్తిపైనా ఆధారపడి ఉంటుంది. రచయిత పుట్టి పెరిగిన ఊరు, చదువు, వృత్తి,  సామాజిక, ఆర్థిక నేపథ్యాలు తాను రాసే కథలకు ఇతివృత్తాలను అందిస్తాయి. అలాంటి కథలే పాఠకులను అలరిస్తాయి.బద్రి నర్సన్ కథల సంపుటి ‘దారి తెలిసిన మేఘం’ కొన్ని కథలు ఈ స్థాయిని అందుకున్నాయని చెప్పవచ్చు.  

‘కూటి విద్యలు’:  శ్రమ లేకుండా సులభమైన మార్గంలో ప్రజల నమ్మకాలను ఆస రాగా తీసుకుని బురిడీలు కొట్టిస్తూ ప్రజల నుంచి సొమ్ము చేసుకునే విద్య ప్రధానాంశం గా సాగిన కథ ఇది. పదో తరగతి వరకు చదువుకుని, జాతకాలు చెపుతూ, ముహూర్తాలు పెట్టే గోపాలమూర్తి ఈ కథకు ప్రధాన సూత్రధారి. ప్రజల విశ్వాసాలను ఆసరాగా చేసుకొని యువతను  లోపభూయిష్టమైన ఉపాధి వైపు మళ్లించడం ఎంతవరకు ఉపయుక్తంగా ఉంటుంది, ఆ మార్గం విజయం సాధిస్తుందో లేదో కాలమే తేల్చాలి. కథనం స్పీడుగా, హాస్యధోరణిలో  సాగిపోతుంది.

‘పాలు మరచిన వాళ్లు’: ఈ కథ నాలుగు కుటుంబాల్లోని మగసంతానం కన్నవాళ్లకు అనుకూలంగా ఉన్న మాట అటుంచి కన్నతల్లినే కొట్టే స్థాయికి ఎదగడం హీనాతిహీన చర్యగా గోచరిస్తుంది. పెద్దవాళ్ల మాట పట్ల యువతలో అనంగీకార ధోరణి వారి వీరోచితమైన గెలుపునకు ప్రతీకనా లేక పతన దిశకు శ్రీకారమా అని అనిపిస్తుంది. ముగింపులో మాధవి మరణం బాధను కలిగిస్తుంది.

‘జేష్టపాలు’: చరమాంకంలో కన్న తల్లి రాంబాయి బాగోగులు చూడడం అన్న ప్రక్రియను ఉన్న ముగ్గురు కొడుకులు వంతుల వారీగా పంచుకుంటారు. అక్కడే ఉండి ఆ మాటలు విన్న కన్న తల్లి రాంబాయి ప్రాణా లు అప్పుడే పోయిఉంటాయి, ఎందుకంటే రాంబాయికి తన స్వంత ఊర్లోనే అంత్యక్రియ లు జరగాలని ఆమె కోరిక. సమాజంలోనున్న ప్రస్తుత స్థితిగతులను యథార్థంగా వెల్లడి చేసిన కథ ఇది. శవం నవ్వడమనేది సత్యదూరమైనా రాంబాయి ముఖంలో తన కోరిక నెరవేరడంతో చిరునవ్వు ద్యోతకమయ్యిందన్న ముగింపు రచయిత ఆలోచనకు పెద్ద పీట వేస్తుంది.

‘వర శాపం’: మనసులు కలవడానికి అంగవైకల్యం అడ్డురాదని చెప్పే వింతైన ప్రేమ కథ ఇది. వింత మలుపుల కారణంగా దూరమైన సులోచనను వెతుక్కుంటూ వచ్చిన సుందర్రాజును చూసి మొదట కోపగించుకున్నా, ఆయ న చెప్పిన వివరణతో ఆమె మనసు కరిగి విలపిస్తూ ఆయనపై వాలిపోయి ముద్దు పెడు తుంది. ఆ తరువాత సుందర్రాజు పెళ్లి చేసుకుందామన్న ప్రతిపాదనను సులోచన సున్ని తంగా తిరస్కరిస్తుంది. ఇరవై సంవత్సరాలుగా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోయిన సుందర్రాజుకి అది వరమో శాపమో తేల్చుకోమన్న వాక్యంతో కథ ముగుస్తుంది.

‘మూడు స్తంభాలాట’: విప్లవోద్యమ నేపథ్యంతో రామస్వామి, ప్రభాకర్, ప్రకాష్ ముఖ్య పాత్రలుగా సాగిన కథ ఇది. విప్లవోద్యమంపై స్పష్టమైన అవగాహన ఉన్న రామస్వామి ఉద్యమం పట్ల అంటీ ముట్టనట్టుగా ఉంటూ ఉన్నత చదువుతో ప్రొఫెసర్‌గా ఉద్యో గం చేసి రిటైర్ అవుతాడు. ప్రభాకర్ చురుగ్గా విప్లవోద్యమంలో పాలుపంచుకుని దానికే అంకితమౌతాడు ప్రకాశ్ విప్లవ సాహిత్యాన్ని ప్రచురించి పంపిణీ చేస్తూ పోలీసులకు చిక్కి కటకటాల పాలై విడుదలై, విద్యా సంస్థలను నెలకొల్పి ఎమ్మెల్సీ అవుతాడు. విద్యార్థులుగా ఒకే భావజాలంతో ఉన్న ఈ మిత్రులు తరువాత ఎవరికి వారై విడిపోతారు. ఇది ప్రస్తుత విప్లవ నేపథ్య జీవితాలకు అద్దం పడుతుంది.

‘కాల జ్ఞానం’: సినిమాటిక్‌గా వేగంగా కొనసాగింది ఈ కథ. వాస్తవంలో వంద శాతం ఇలా జరుగుతుందా అంటే జరగడానికి ఛాన్స్ లేకపోవచ్చు లేదా ఉండనూవచ్చు అని అనిపిస్తుంది. హతుడి, హంతకుడికి పిల్లలు ఆ హత్య పట్ల అవగాహన లేకుండా కాకతాళీయంగా కలుసుకోవడం, అనుబంధం పెం చుకుంటారు. రక్తపాతం శత్రుత్వం వల్ల ఒరిగేది ఏమీ లేదని నమ్మిన ఆ స్నేహితులిద్దరి స్ఫూర్తిమంతమైన నిర్ణయంతో కథ సుఖాంతంమవుతుంది.

‘రబ్బరు బొమ్మ’: ఒక నవలకున్న విస్తృతి ఈ కథకుంది. రబ్బరుబొమ్మలాంటి కూతురు జీవానికి ఉన్న అరుదైన సెరబ్రల్ పాల్సి వ్యా ధిని భర్త ప్రతాప్ సహకారంతో తల్లి సరోజ సంయమనం పాటిస్తూ, సమయస్ఫూర్తితో, ధైర్యంతో పరిస్థితులను ఎదుర్కొంటూ, త్యాగ బుద్ధితో సంఘంలో ఆమెను ఒక విద్యావంతురాలిగా పెంచి పెద్ద చేసిన తీరు మహిళలం దరికి స్ఫూర్తిదాయకం. ఇలాంటి కథలు మరెన్నో మనల్ని అబ్బురపరుస్తాయి. కొత్త ఆలోచనలను రేకిత్తిస్తాయి.

“చావు నీడ”: వయసు పైబడిన విశ్రాంత జీవితంలో తిరిగి కలిసిన మిత్రులు అనారోగ్య కారణంగా ఒక్కొక్కరూ కనుమరుగైపోతున్న తరుణంలో కొందరు చావుకు బెదిరిపోవడం మామూలే. అలా బెదరకుండా జీవితాన్ని కొనసాగించాలన్న అభిలాషను నింపి, ధైర్యాన్ని చెప్పే కథ చావు నీడ.  ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ అందరూ తప్పకుండా చదవాల్సిన కథ ఇది. ఎన్ని ధనరాశులు పోసినా క్షణ కాలా న్ని కూడా కొనుక్కోలేం అని తండ్రి నారాయణకు ధైర్యాన్నిస్తూ కొడుకు గణేశ్ చేసిన హితబోధ అందరికీ స్ఫూర్తిదాయకం. మంచి జీవిత విలువలను తెలియజెప్పే కథ ఇది.

కథా రచయితగా నర్సన్ వయస్సు ఇంకా పది సంవత్సరాలు నిండకపోయినా ఈ ‘దారి తెలిసిన మేఘం’ కథలు లబ్ద ప్రతిష్టులైన వారి రచనలకు ఏమాత్రం తీసిపోవు. ప్రేమ, త్యా గం, అభ్యుదయభావాలు, సాంఘిక దురాచారాలు, సామాజిక స్థితిగతులు, మానసిక పరిస్థితులు, అంతరిస్తున్న అనుబంధాల విలువలు, విప్లవోద్యమం నేపథ్యం ఇత్యాది విభిన్న అంశాల సమాహారంగా రాసిన కథలు పాఠకుల్ని చదివిస్తాయి. ప్రతి కథ కూడా సహజ త్వాన్ని పునికిపుచ్చుకుని నిండుగా గంభీరంగా పాఠకుల్ని అలరిస్తుంది. ఆలోచింపజేస్తుంది. కొన్ని కథలు కొంతకాలం వెంటాడతాయి కూడా. ఎక్కువ శాతం కథలు వివిధ పోటీల్లో గెలుపు దండను మెళ్లో వేసుకున్నవే.

- దాసరి నాగభూషణం

ప్రతులకు

రచన : బద్రి నర్సన్

పేజీలు 160 , వెల : రూ. 150-

నీలమ్ పబ్లికో ప్రచురణ

ప్రతులకు: 9440128169