25-07-2025 12:44:55 AM
4 రోజుల పాటు భారీవర్షాలు
అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశాలు
హైదరాబాద్, జూలై 24 (విజయక్రాంతి): ఉత్తర బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ర్టంలో శుక్రవారం నుంచి 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడా ఉరుములు మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీవర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
శుక్రవారం ఉదయం 8.30 గంట ల వరకు సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, ములుగు, జయశంకర్ భూపా లపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ ఆ జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఇక శుక్రవారం ఉదయం 8.30 గంట ల నుంచి శనివారం ఉదయం 8.30 గంటల వరకు ఆదిలాబాద్, నిర్మ ల్, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిజామాబాద్, వరంగల్, జనగా మ, హనుమకొండ, మెదక్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, కామారెడ్డి జిల్లాల పరిధిలో అక్కడక్కడ భారీ వర్షసూచన చేసింది.
గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అలాగే రాష్ట్రంలో ఈ నెల 28 వరకు పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
అన్ని విభాగాలు అప్రమత్తంగా ఉండాలి..
రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన, అక్కడి నుంచే సీఎంవో అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని గురువారం ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు ఇతర జిల్లాల్లో కుండపోత వర్షాలు పడుతున్న ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు.
జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, వాటర్ వర్క్స్, విద్యుత్, పోలీస్, ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్, హైడ్రా వంటి విభాగాలు అప్రమత్తంగా ఉండి, సమన్వయంతో పనిచేయాలని సీఎం సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే సమస్యలు, ట్రాఫిక్ జామ్, విద్యుత్ అంతరాయాలను తక్షణం పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని, ప్రజల ఫిర్యాదులకు వెంటనే స్పందించాలని ఆదేశించారు. ఐఎండీ వాతావరణ సూచనల ఆధారంగా ముందస్తు హెచ్చరికలు, రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టాలన్నారు.