calender_icon.png 27 July, 2025 | 2:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉన్నత స్థానంలో ఉండాలంటే బాగా చదువుకోవాలి

26-07-2025 04:23:50 PM

జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి..

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): జీవితంలో ఉన్నత స్థానంలో ఉండాలంటే బాగా చదువుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి(District Collector Ila Tripathi) చెప్పారు. చదువుతో పాటు క్రీడలు, స్విమ్మింగ్ రన్నింగ్ వంటి అంశాలపై దృష్టి సారించాలని అన్నారు. శనివారం ఆమె జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్(SP Sharath Chandra Pawar)తో కలిసి నల్గొండ జిల్లా, నార్కెట్పల్లిలోని మహాత్మ జ్యోతిబాపూలే రెసిడెన్షియల్ కళాశాలను సందర్శించారు. ముందుగా కళాశాలలో విద్యార్థుల సంఖ్య, మౌలిక వసతులు, విద్య, భోజనం తదితర అన్ని వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. చదువుతో పాటు, విద్యార్థులకు క్రీడలు అవసరమని, అంతేకాక రన్నింగ్ స్విమ్మింగ్ అన్నింటిలో ప్రవేశం ఉండాలని, అప్పుడే సంపూర్ణ మూర్తిమత్వాన్ని సాధిస్తారని చెప్పారు. కష్టపడి చదివితేనే జీవితంలో ఉన్నత స్థానంలో ఉంటారని, అందువల్ల చదువుపైన దృష్టి సారించాలని, చెడు అలవాట్లకు లోను కావద్దని  అన్నారు.

జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ.. అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు విద్యార్థులు ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని, లక్ష్యసాధనకు ప్రణాళికతో పాటు, గొప్ప వారిని ఆదర్శంగా తీసుకోవాలని, కష్టపడి పని చేయడం, లక్ష్యసాధన పైనే దృష్టి సారించడం వంటివి చేయాలన్నారు. ముఖ్యంగా విద్యార్థులు చెడు అలవాట్లకు లోను కావద్దని, ప్రత్యేకించి డ్రగ్స్, మద్యం, సిగరెట్ తదితర వాటి జోలికి వెళ్ళవద్దని అన్నారు. చెడు అలవాట్ల కారణంగా కేసు నమోధైతే దాన్నుంచి బయటపడడం కష్టమని, భవిష్యత్తులో ఏదైనా ఉద్యోగం సాధించినప్పుడు పోలీసు ద్వారా చేసే వెరిఫికేషన్ సమయంలో ఇవన్నీ అడ్డు వస్తాయని, అందువల్ల ఎట్టి పరిస్థితులలో చెడు వైపు వెళ్ళవద్దని అన్నారు. ఒకసారి చేసే చిన్న తప్పు జీవితాంతం వెండాడుతుందని, దానికి శిక్ష అనుభవించాల్సి వస్తుందని చెప్పారు. బాగా చదువుకునేందుకు జిల్లా యంత్రాంగం తరుపున ఎలాంటి చేయూత కావాలన్నా అందిస్తామని తెలిపారు. నల్గొండ ఆర్డిఓ వై. అశోక్ రెడ్డి, తహసిల్దార్ వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు.