15-11-2025 05:32:27 PM
* జిల్లాలో ఇప్పటివరకు 1,14,077.960 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ.102.84 కోట్ల చెల్లింపులు
* ట్యాగ్ చేసిన మిల్లులకే ధాన్యం తరలించాలి
* కొనుగోళ్ల పర్యవేక్షణకై పటిష్ట చర్యలు
* పశు వైద్యశాల ద్వారా సమర్థవంతమైన సేవలు అందించాలి
* జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
పాపన్నపేట (విజయక్రాంతి): ధాన్యం నగదు చెల్లింపులో మరింత వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. శనివారం మండల కేంద్రంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం, ఎల్లాపూర్ లోని పశువైద్యశాలను తహసిల్దార్ సతీష్ తో కలిసి పరిశీలించారు. ధాన్యం కొనుగోలు కేంద్రానికి ఇప్పటివరకు వచ్చిన ధాన్యం ఎంత, అందులో ఎంత మేరకు కొనుగోలు చేసారు, ఇంకా తేమ శాతం రావాల్సిన ధాన్యం ఎంత ఉంది, కొనుగోలు పూర్తి అయిన ధాన్యం వివరాలు ఆన్లైన్ లో నమోదు చేసారా లేదా, అలాగే కొనుగోలు అయిన ధాన్యం ట్యాగ్ చేసిన మిల్లులకి తరలిస్తున్నారా లేదా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ ఖరీఫ్ సీజన్ కి సంబందించి ధాన్యం నగదు చెల్లింపులో మరింత వేగం పెంచి ముందుకు పోవాలని సూచించారు. గత సంవత్సరం ఇదే నెలలో 10,185 మంది రైతుల నుంచి 61,231.960 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ. 4.71 కోట్లు చెల్లించగా.. ప్రస్తుత సీజన్ కి ఇప్పటివరకు 27,252 మంది రైతుల నుండి 1,14,077.960 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ.102.84 కోట్ల చెల్లింపులు జరిగాయన్నారు.
తేమ శాతం వచ్చి కొనుగోలుకి సిద్ధంగా ఉన్న ధాన్యం కొనుగోలు వేగవంతంగా జరగాలన్నారు. అదే విధంగా కొనుగోలుకి సంబందించిన రిజిస్టర్లన్ని పక్కాగా నిర్వహించాలన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేలా స్పెషల్ ఇన్స్పెక్షన్ టీం ను నియమించి పర్యవేక్షణ చేసేలా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. పశు వైద్యశాలకు క్రమం తప్పకుండా విధులకు హాజరు కావాలని, ఆసుపత్రి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఎప్పుడు పాడి రైతులకు అందుబాటులో ఉండి పాడి పశువుల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని పశువైద్య సిబ్బందికి సూచించారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు ఆకుల శ్రీనివాస్, శ్రీకాంతప్ప, శ్రీను, ఆయా శాఖల సిబ్బంది తదితరులు ఉన్నారు.