25-11-2025 04:56:13 PM
రణభేరి సభ పోస్టర్ ఆవిష్కరణ చేసిన కల్లు గీత కార్మికులు..
ఇంటికో గౌడ్ ఊరికో వాహనంతో కదిలి రావాలి..
కన్నాయిగూడెం కల్లు గీత కార్మిక సంఘం పిలుపు..
కన్నాయిగూడెం (విజయక్రాంతి): ములుగు జిల్లా కన్నాయిగూడెం మండల కేంద్రంలో కల్లు గీత కార్మిక సంఘం కన్నాయిగూడెం మండల అధ్యక్షులు పాలకుర్తి శ్రీధర్ గౌడ్ ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 28 చలో సూర్యాపేట రణబేరి బహిరంగ సభను జయప్రదం చేయాలని కల్లు గీత కార్మిక సంఘం మండల గౌరవ అధ్యక్షులు మారగాని రాజు గౌడ్ సంఘం మండల అధ్యక్షులు పాలకర్తి శ్రీధర్ గౌడ్ గీత కార్మికులకు పిలుపునిచ్చారు. సోమవారం రోజున కన్నాయిగూడెం మండలంలోని గుర్రెవుల సోసైటీ తాటి వనంలో రణభేరి పోస్టర్ లను సొసైటీ అధ్యక్షులు తండా ప్రభాకర్ గౌడ్ అధ్యక్షతన ఆవిష్కరించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మారగాని రాజు గౌడ్ పాలకుర్తి శ్రీధర్ గౌడ్ లు మాట్లాడుతూ ప్రభుత్వం 50 సంవత్సరాలు నిండిన గీత కార్మికులందరికీ ఎటువంటి షరతులు లేకుండా వృత్తి పింఛను 4000 ఇవ్వాలని అలాగే గీత వృత్తి పింఛన్ సైట్ను తక్షణమే ఓపెన్ చేయాలని ప్రభుత్వాన్నిడిమాండ్ చేశారు. తాటి ఈత చెట్ల పెంపకానికి 10 ఎకరాల భూమి ప్రభుత్వం కొనుగోలు చేసి ఇవ్వాలని అలాగే పెండింగ్లో ఉన్న ఎక్సియాలు తాడి కార్పొరేషన్ చెక్కులు తక్షణమే విడుదల చేయాలని ఏజెన్సీ పేరుతో రద్దు చేసిన గీత సోసైటీలను తక్షణమే పునరుద్దరణ చేయాలనీ డిమాండ్ చేస్తూ ఈనెల 28న సూర్యాపేటలో జరుగు రణభేరి బహిరంగ సభకు మండలం నుండి అన్ని గ్రామాల నుండి గీత కార్మికులు కదిలి రావాలని కల్లుగీత కార్మికు పిలుపునివ్వడం జరిగింది.