పెళ్లి పేరుతో యువతిని మోసం చేసిన వ్యక్తి అరెస్ట్
- ఆర్మీ అధికారినని నమ్మించేందుకు ఏఐ ఫోటోల వినియోగం
- బాధితురాలి నుంచి డబ్బులు వసూలు
నాగోల్, జూలై 2 (విజయక్రాంతి): పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిని మోసం చేసిన వ్యక్తిని నాగోల్ పోలీసులు అరెస్టు చేశారు. నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆనంద్నగర్కు చెందిన ఓ మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఇన్స్పెక్టర్ మహమ్మద్ మక్బూల్ జానీ తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం, శామీర్పేట్కు చెందిన ముకేరా గోవర్ధన్ (29) సోషల్ మీడియా ద్వారా బాధితురాలితో పరిచయం పెంచుకున్నాడు.
తాను ఆర్మీ అధికారినని నమ్మించేందుకు కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో రూపొందించిన నకిలీ ఫోటోలను ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి బాధితురాలితో సహజీవనం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా, తన తండ్రి అనారోగ్యంగా ఉన్నారని చెప్పి బాధితురాలి నుంచి భారీ మొత్తంలో నగదు తీసుకున్నట్లు, అనంతరం ఆమెను బెదిరింపులకు గురిచేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
దర్యాప్తులో నిందితుడికి ఇప్పటికే వివాహం జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. విచారణలో గత ఏడాది ఆల్వాల్ ప్రాంతానికి చెందిన మరో మహిళను కూడా ఇదే తరహాలో పెళ్లి పేరుతో మోసం చేసిన కేసులో నిందితుడు అరెస్టై జైలుకు వెళ్లి, ప్రస్తుతం బెయ్పి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం రిమాండ్ విధించడంతో చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించినట్లు ఇన్స్పెక్టర్ మహమ్మద్ మక్బూల్ జానీ తెలిపారు. సోషల్ మీడియా ద్వారా ఏర్పడే పరిచయాల విషయంలో పూర్తి వివరాలు నిర్ధారించుకున్న తర్వాతే ముందుకు వెళ్లాలని, అపరిచితులను గుడ్డిగా నమ్మవద్దని పోలీసులు ప్రజలకు సూచించారు.






