11-03-2025 07:16:34 PM
దౌల్తాబాద్: గత కొంత కాలంగా మద్యానికి బానిసకాగా కొద్దిరోజుల క్రితం కుటుంబ సభ్యులు మందలించి అతనితో మద్యం మాన్పించడంతో జీవితంపై విరక్తి చెంది ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాయపోల్ మండల కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. రాయపోల్ పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. రాయపోల్ మండల కేంద్రానికి చెందిన బ్యాగరి శ్రీను (45) వ్యవసాయం, హమాలీ కార్మికుడిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు.
సోమవారం బంధువుల ఇంట్లో శుభకార్యానికి హాజరై సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత భార్య చంద్రకళతో తనకు డబ్బులు ఇవ్వాలని గొడవపడగా, ఆమె డబ్బులు ఇవ్వనని నిరాకరించడంతో మనస్థాపం చెంది, రాత్రి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి, గ్రామ శివారులో వ్యవసాయ పొలం వద్ద చెట్టుకి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు ఉదయం లేచి చూసేసరికి ఇంట్లో శ్రీను కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతుకగా గ్రామ శివారులో చెట్టుకి ఉరి వేసుకున్నాడు. మద్యానికి డబ్బులు ఇవ్వని కారణంగా మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడని మృతుని భార్య చంద్రకళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాయపోల్ ఎస్ఐ రఘుపతి తెలిపారు.