11-03-2025 07:20:50 PM
అధికార పార్టీ నాయకుల అండతో ప్రభుత్వ భూముల కబ్జాలు...
అక్రమార్కులకే వంతపాడుతున్న మేడిపల్లి రెవిన్యూ అధికారులు...
జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని ప్రభుత్వ భూములను కాపాడాలి...
బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి మీసాల కృష్ణ డిమాండ్...
మేడిపల్లి (విజయక్రాంతి): బోడుప్పల్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని సర్వేనంబర్ 63/28 నుండి 63/39 వరకు గల గౌతమ్ నగర్లోని ప్రభుత్వ భూమిలో కొందరు అధికార పార్టీ నాయకులు కుమ్మకై కబ్జాలు చేస్తున్నారని నగర బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మీసాల కృష్ణ ఆరోపించారు. 12వ డివిజన్ ఇంచార్జ్ చంటి శ్రీనివాస్, 12,13 వ డివిజన్ నాయకులుతో కలిసి ప్రభుత్వ భూముల అక్రమాలపై విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ... బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గౌతమ్ నగర్, దేవేందర్ నగర్, అంబేద్కర్ నగర్, రాజీవ్ నగర్ కాలనీలలో వెయ్యిల గజాల స్థలాలను కబ్జాలు చేస్తూ బహిరంగానే అమ్మకాలు చేస్తున్నారని వీటిపై బీఆర్ఎస్ పార్టీ తరుపున అనేక సార్లు రెవిన్యూ అధికారులకు ఫీర్యాదు చేసిన అధికార పార్టీ నాయకులకు తలోగ్గి పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు.
నగర పరిధిలోని డబుల్ బెడ్రూం దగ్గర చర్చి పేరుతో 100 గజాలు కబ్జా చేసి ప్రజాప్రతినిధులు పదవి కాలం ముగిసిన తర్వాత శిలాపలకం ఏర్పాటు చేస్తూ ప్రారంభించిన ఘనులు కాంగ్రెస్ నాయకులు అంటూ ఏద్దెవా చేశారు. బిస్కెట్ గోదాం ప్రక్కన్న 2000 గజాల స్థలంలో కబ్జా చేసి దర్జాగా నిర్మాణాలు చేపట్టారని, అంబేద్కర్ విగ్రహం ప్రక్కన్న 1000 గజాల స్థలంలో గదుల నిర్మాణం, సర్వేనంబర్ 63/1 లో ప్రభుత్వ పాఠశాలకు అనుకొని 60 గజాల చొప్పున 1000 గజాలలో 15ఫ్లాట్లు చేసి అమ్మకానికి పెట్టారని, డబుల్ బెడ్రూంకు అనుకొని దేవేందర్ నగర్ ఫేస్-2లో కమ్యూనిటి హల్ కోసం బీఆర్ఎస్ పార్టీలో ఉండి దర్నా చేసిన కాంగ్రెస్ ల్లో చేరిన నాయకులు ఆ నిర్మానాన్ని సైతం 20 లక్షలకు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారన్నారు.
మల్లాపూర్ వెళ్లే దారిలో పెట్రోల్ బంక్ వెనుక సమీకృత మార్కెట్ కు అనుకొని 1000 గజాల స్థలాన్ని కబ్జా చేసి నిర్మాణాలు చేస్తున్నారని మండిపడ్డారు. అధికార పార్టీ అండతో కాంగ్రెస్ నాయకులు చేస్తున్న అక్రమాలపై జిల్లా కలెక్టర్, ప్రభుత్వం సత్వరమే స్పందించి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బోడగళ్ల సదానంద్, 12వ డివిజన్ అధ్యక్షుడు తాండూరి శివకుమార్, యువజన నాయకులు చిన్నింగళ్ళ సంతోష్, మైసగళ్ళ శ్రీకాంత్, మీసాల అర్జున్, చంటిశివ, బొల్లం శశి, తదితరులు పాల్గోన్నారు.