22-11-2025 01:17:04 AM
చారకొండ, నవంబర్ 21: కల్వర్టుపైన కూర్చోని అదుపు తప్పి కిందపడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన చారకొండ మండలంలో గురువారం అర్థరాత్రి చోటు చేసుకుంది. ఎస్‌ఐ పి.వీరబాబు తెలిపిన కథనం ప్రకారం నల్గొండ జిల్లా డిండి మండలం బొల్లనపల్లి గ్రామానికి చెందిన పేట వీరస్వామి (60) బ్రతుకు దేరువు కోసం కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ లోని మన్నెగుడలో 28 ఏళ్ల క్రితం నుంచి నివాసం ఉంటున్నాడు. ఈనెల 18న బొల్లనపల్లికి వెళ్లి వస్తానని భార్య మల్లమ్మకు చెప్పాడు.
రెండు రోజుల పాటు బొల్లనపల్లిలోని ఇంటి వద్దనే ఉన్నాడు. గురువారం మండలంలోని శిరుసనగండ్లలో తన అక్క ఇంటికి వెళ్తుండగా మార్గ మధ్యలో శాంతిగుడెం గ్రామంలోని రోడ్డు పక్కన ఉన్న కల్వర్టుపైన కూర్చోని అదుపు తప్పి కిందపడి మృతి చెందాడు. గమనించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. వివరాలు తెలుసుకున్న పోలీసులు అతని కుటుంబ సభ్యులకు సమచారం ఇచ్చారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృత దేహాన్ని పోస్టుమార్టం కోసం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.