22-11-2025 12:57:35 AM
ఇందిరమ్మ ఇంటి నిర్మాణాల్లో ఇబ్బందులు
ముగ్గుపోసే దశలోనే ముసురుకున్న సమస్యలు
ఇప్పటివరకు మంజూరైన ఇళ్లు : 3.38 లక్షలు
నిర్మాణాలు ప్రారంభమైనవి : 2.38 లక్షలు
పక్షం రోజుల్లో నిర్మాణాలు ప్రారంభించకుంటే రద్దు చేస్తామని అధికారుల నోటీసులు
హైదరాబాద్, నవంబర్ 21 (విజయక్రాంతి): ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం ఆశించిన మేర ముందుకు సాగడం లేదు. సొంత స్థలం ఉండి, గూడు లేని వారికి సొంతింటి కలను నిజం చేసేందుకు ప్రభుత్వం రూ. 5 లక్షలను నాలుగు విడతలుగా అందిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున గత జూన్, జులై నెలల్లో మొత్తం 4.50 లక్షల మంది లబ్ధిదారులను ప్రభుత్వం ఎంపిక చేసింది.
వీటిలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 3,38,681 మందికి ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి సంబంధించిన మంజూరు పత్రాలను అందజేసింది. అయితే ఇంటి నిర్మాణాలను 2,38,159 మంది లబ్ధిదారులు మాత్రమే ప్రారంభించారు. ఇంకా 1,00,522 మంది లబ్ధిదారులు ముగ్గులు కూడా పోయలేదు. బేస్‌మెంట్ లెవల్ వరకు 87,313 ఇళ్లు, గోడల వరకు 42,627, శ్లాబ్ వరకు పూర్తయినవి 44,297 ఇళ్లు ఉన్నాయి. ఈ ఐదేళ్ల వరకు రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల ఇళ్లను నిర్మిస్తామని ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
మంజూరు పత్రాలు అందజేసిన తర్వాత 45 రోజుల్లో ఇళ్ల నిర్మాణలు చేపట్టాలని, లేదంటే ఇంటిని రద్దు చేస్తామని గతంలోనే సర్కార్ హెచ్చించింది. మంజూరు పత్రాలు అందజేసి నాలుగు నెలలు గడుస్తున్నా ముగ్గు పోసినా.. పునాది తీయలేదని పరిస్థితిలో లక్ష మంది వరకు ఉన్నారు. ఇంటి నిర్మాణం 400 చదరపు అడుగుల నుంచి 600 చదరపు అడుగుల వరకు ఉండాలని సర్కార్ షరతు పెట్టిన విషయం తెలిసిందే.
వీరిలో కొందరు ఇంటి నిర్మాణం వైశాల్యం తక్కువగా ఉందని, మరి కొందరు చేతిలో డబ్బులు లేక ఇంటి నిర్మాణం పనులు మొదలు పెట్టడం లేదు. బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిస్తామని ప్రభుత్వం చెబుతున్నా ఇంకా లక్ష మందికి పైగా ముందుకు రావడం లేదు. సంబంధిత అధికారులు మాత్రం 15 రోజుల్లోగా ఇంటి నిర్మాణానికి ముగ్గు పోసి, పునాది పనులు మొదలు పెట్టాలని.. లేదంటే రద్దు చేస్తామని నోటీసులు జారీ చేస్తున్నారు. దీంతో సామాన్యుడికి సొంతింటి ని ర్మాణం కల గానే మిగిలిపోతుందనే ఆందోళన లబ్ధిదారుల్లో నెలకొన్నది.
భారమవుతున్న స్టీల్, సిమెంట్, ఇసుక ధరలు..
ఇందిరమ్మ ఇంటిని నిర్మించుకోవడానికి చాలమంది ముందుకు రాకపోవడానికి స్టీల్, సిమెంట్, ఇటుక, కంకర, ఇసుక ధరలతో పాటు మేస్త్రీల ఖర్చులు కూడా ఆమాంతం పెరడంతో ఇందిరమ్మ లబ్ధిదారులు ఇంటిని నిర్మించుకోవడానికి ముందుకురావడం లేదని తెలుస్తోంది. స్టీల్, సిమెంట్, ఇసుక ధరలను ఇందిరమ్మ లబ్ధిదారులకు తక్కువ రేటుకు అందించేందుకు ప్రభు త్వం కృషి చేస్తుందన్న హామీ ఎక్కడా అమలు కావడం లేదని లబ్ధిదారులు చెబుతున్నారు.
ఇంటి నిర్మాణం ప్రారంభించిన లబ్ధిదారుల్లో కొందరికి సాంకేతిక కారణాల వల్ల బిల్లులు ఆలస్యం అవుందని, అందుకే ప్రా రంభించిన ఇళ్లు కూడా తొందరగా పూర్తి కావడం లేదని చెబుతున్నారు. ప్రభుత్వం అందజేసిన సాయం చాలకపోవడం, సకాలంలో బిల్లులు అందక , బిల్లుల కోసం కొందరు లంచాలు ఇచ్చుకోలేక చాలా మంది లబ్ధిదాలు ఇళ్లు నిర్మించుకునేందుకు ముందూ వెనుకా ఆలోచిస్తుంటే..
నిబంధనలకు అనుగుణంగా లేవంటూ కేంద్ర ప్రభుత్వం మరికొన్నింటిని రద్దు చేస్తోంది. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఫిర్యాదుల కోసం ప్రభుత్వం కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేయగా, 83,229 మంది ఫోన్ చేశారు. వీటిలో 43,976 మందికి పరిష్కారాలు సూచించినట్లు హౌసింగ్ కార్పోరేషన్ అధికారులు చెబుతు న్నారు.
వివిధ దశల్లో ఇళ్ల నిర్మాణాలు..
మొత్తం లబ్ధిదారులు ఎంపిక 4,50,000
మంజూరుచేసిన ఇళ్లు 3,38,681
నిర్మాణాలు ప్రారంభమైనవి 2,38,159
బెస్‌మెంట్ లెవల్ వరకు వచ్చినవి 87,313
గోడల వరకు పూర్తయినవి 42,627
శ్లాబ్ వరకు పూర్తయినవి 44,297
ఇప్పటివరకు చెల్లించిన డబ్బులు-రూ కోట్లలో
విడుదల చేసిన డబ్బులు రూ. 3053.99 కోట్లు
బేస్‌మెంట్ వరకు రూ.1643.87
రూఫ్‌లెవల్ వరకు రూ. 759.53
శ్లాబ్ వరకు రూ. 650.59