22-11-2025 01:26:51 AM
బెట్టింగ్ యాప్స్ కేసులో విచారణకు హాజరైన
శ్రీముఖి, నిధి అగర్వాల్, అమృత చౌదరిని ప్రశ్నించిన ‘సీఐడీ’
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 21 (విజయక్రాంతి): రాష్ర్టంలో సంచలనం సృష్టిస్తున్న ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో దర్యాప్తు మరింత వేగవంతమైంది. ఈ కేసులో భాగంగా యాంకర్ శ్రీముఖి, హీరోయిన్ నిధి అగర్వాల్, మరో నటి అమృత చౌదరి శుక్రవారం సీఐడీ సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సాగిన ఈ విచారణలో అధికారులు వారిపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది.
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసినందుకుగాను ఎంత డబ్బు తీసుకున్నారు, ఆ లావాదేవీలు ఏ రూపంలో, ఎలా జరిగాయి అనే అంశాలపై సిట్ అధికారులు ప్రశ్నించినట్టు సమాచారం. ఈ యాప్‌లను నడిపిన నిర్వాహకులతో వారికి ఉ న్న సంబంధాలు, ఒప్పందాల వివరాలను కూడా అధికారులు అడిగి తెలుసు కున్నట్లు తెలుస్తోంది.
ఈ కేసులో ఇప్పటికే నటులు రానా దగ్గుబాటి, ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండలను సిట్ అధికారులు విచారించారు. తాజాగా శ్రీముఖి, నిధి అగర్వాల్‌లను విచారించడంతో, ఈ కేసులో మరికొంత మంది టాలీవుడ్ ప్రముఖుల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.